ఆకట్టుకునే ఆఫర్లతో అమాయకులు బలి
చీట్ చేస్తున్న చిట్ ఫండ్ మాయగాళ్లు
సొచ్చేదాకా సోమలింగం సొచ్చినాకా రామలింగం
ఇచ్చేదొకరు వసూలు చేసేది మరొకరు
క్రెడిట్ కంపెనీల కిరాతక వడ్డీలు
క్రెడిట్ స్కోరు బాగుంది బాకీ తీసుకో
పే లేటర్ పేరుతో వస్తు విక్రయాలు
పేమెంట్ లేటైతే ఫోన్లతో పరేషాన్
క్రిమినల్ కేసులు నోటీసులతో కిరికిరి
ఆదాయానికి మించి అప్పులు చేసి
ఆత్మగౌరవం చంపుకోలేక ఆత్మహత్యలు
వడ్డీ వ్యాపారం వ్యభిచారం కంటే హీనం
పురాణాలు, పవిత్ర గ్రంధాలు చెబుతున్న నిజాలు
రాష్ట్రంలో విచ్చలివిడిగా వడ్డీ కంపెనీలు
అప్పులిచ్చిన ఆప్ ల అరాచకాలు
హైదరాబాద్, ప్రజాజ్వాల:
తెలంగాణలో అధికశాతం ప్రజలు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. అవసరం లేకున్నా అప్పులు చేసి ఆగమైతున్నారు. ఆస్తి పాస్తులు లేని వారు రోజు వారి కూలీలు ప్రశాంతంగా పనులు చేసుకుని బతుకుతుంటే.. వచ్చినదాంతో సంతోషంగా కాలం వెళ్లదీస్తున్నవారిని వడ్డీ వ్యాపారులు వలవేసి పట్టుకుంటున్నారు. ఆకాశంలో మేడలు కట్టి చూపిస్తూ వాళ్ల ముగ్గులోకి దించేస్తున్నారు. చిట్టీపాటలంటూ పల్లేపల్లేలో పరేషాన్ చేసేస్తున్నారు. అవసరం లేకున్నా అప్పు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు కాబట్టి తీసుకుంటే పోదా అనుకున్న అమాయకులు ఆ తరువాత లబోదిబోమంటూ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ యుగంలో ఇక లోన్ ఆప్ ల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ... అడ్డగోలు యాడ్ లతో అమాయకులను బుట్టలో వేసేసుకుంటాన్నాయి. లోన్ కావాలా.. అయితే కేవలం ఆధార్ కార్డు , పాన్ కార్డు ఉంటే చాలు .. మీ అకౌంట్లో నిమిషాలు మీరు కోరిన డబ్బు తీసుకోవచ్చు.. సులువైన వాయిదా పద్దతుల్లో తిరిగి చెల్లించవచ్చు అంటూ ఆఫర్ల ఆప్ లు గందరగోళం చేసేస్తున్నాయి. వారి చిక్కుముడులు చదవకుండా క్లిక్ చేసిన వారు ఇక వడ్డీకి వడ్డీ కట్టలేక కన్నీరుపెడుతున్న దుస్తితి నెలకొంది.. కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు సైతం వాళ్ల సేల్స్ ఎగ్జిక్యూటివ్ లను పంపించి మర్యాదగా మాట్లాడుతూ చిట్టీలో చేర్పిస్తారు. అడిగినంతగా అప్పుకూడా ఇచ్చేస్తారు.. ఆ తరువాత ఇచ్చినప్పుడు మాట మర్యాదలు అసలు ఉండవు.. రికవరీ టీమ్ లతో రికాం లేని ఫోన్లు.. రికవరీ బ్యాచ్ లతో రోజురోజు తంటాలు.. తల ఎక్కడ దాచుకోవాలో తెలియక తొందరపాటుతో తాడుకు వేళాడుతున్న తలకాయలు.. ఈ పాపం ఎవరిది.. తెలిసి తెలియక అప్పులిచ్చే ఆప్ , క్రెడిట్, చిట్స్ ఫండ్ కంపెనీలది కాదా.. వీరికి ఎవరు ఇచ్చారి ఇంతగా స్వేచ్ఛ.. 20 ఏళ్ల క్రితం అప్పు అంటే ఓ తెల్లకాగితంలో తెలిసిన వారు అవసరాన్ని గుర్తించి ఒప్పంద పత్రం రాయించుకుని ఓ కటుంబాన్ని నిలబెట్టడానికో... ఓ ప్రాణాన్ని కాపాడటానికో అప్పు ఇచ్చేవారు.. తీసుకునేవారు.. కానీ నేడు అటువంటి సంప్రదాయాలు లేవు.. తెల్లకాగితం చోట రూపాయి కాగితం అదే ప్రామిసరీ నోటు పుస్తకమే మేంటేన్ చేస్తున్నారు. దానికో రూపాయి స్టాంప్ వేసుకుని మూడు పైసల వడ్డీ నుంచి ముప్పై పైల వడ్డీ వరకు వచ్చింది వ్యాపారం.. గ్రామ గ్రామానా ప్రామీసరి నోటు పుస్తకాల దందాలు ఓ వైపు ఉంటే ...మరో చిట్టీ పాటల లొల్లి మరోవైపు.. వారం చిట్టిలనీ, రోజువారి ఫైనాన్స్ లనీ వీది వ్యాపారులను టార్గెట్ చేసి దందా చేస్తున్నాయి. పొద్దంతా కష్టపడి చెమటోడ్చి సాయంత్రానికి వచ్చే ఫైనాన్స్ వాడికి ఇవ్వాలి.. వ్యాపారంలో నష్టమొచ్చినా లాభమొచ్చినా సంబంధం లేకుండా ఏరోజుది ఆరోజు ఇస్తూనే ఉండాలి.. పొరపాటున ఒకరోజు వ్యాపారం నడవలేదంటే తరువాత రోజు దుకాణమే మూసుకోనే పరిస్థితి.. నేడు తెలంగాణ మొత్తం ప్రగతిపథంలో పరుగెడుతోందని ప్రభుత్వం చెప్పటమే కానీ ప్రతి ఒక్కరు అప్పుల కుంపటిలో కాలి మసైపోతున్నారనేది అక్షరసత్యం..
రానురాను ఆన్ లైన్ లోన్ యాప్ లదైతే ఇక చెప్పనక్కర్లేదు.. ఆన్ లైన్ లోనే వస్తువులు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఇస్తూ.. నెల వారిగా ఈఎమ్ఐలో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేవారిని ఉరికంబాలనెక్కిస్తున్నాయి. షాపింగ్ కార్డులను ఎరగా వేసేవారు.. ఎంచక్కా వాళ్ల టార్గెట్ రీచ్ అవుతారు.. దిక్కుమాలిన కార్డులను అమాయకుల మెడకు చుట్టి పోతారు.. అదేదో బాగుందని వాడినవాళ్లు ఆ కార్డు ఉన్నంతకాలం కట్టు బానిసలుగా బతుకాల్సిందే.. కాదు కూడదంటే క్రిమినల్ కేసుల కుంపటిలో కాలి మసైపోవాల్సిందే...ఇలాంటి దారుణాలు రోజు కళ్ల ముందెన్నో జరుగుతున్నాయి.. ఈ అరాచకాలకు బలైనవారు ఎక్కడో హైదరాబాద్ లోనో,. ఢిల్లీలో నో కాదు మీరే కావచ్చు.. మీ సంబంధీకులే కావచ్చు.. ప్రతిరోజు మదన పడుతున్న వారు మీ చుట్టుపక్కనే ఉన్నారు.. కానీ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.. అలాంటి భయానక వ్యవస్థ నేటి వడ్డీ వ్యాపారం .. అదే వ్యభిచారం..
అప్పుల బాధతో యువకులు ఆత్మహత్య చేసుకున్నారని తెలియగానే హడావుడి చేసిన ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కొన్ని యాప్ లపై చర్యలు తీసుకుంటున్నాయని తెలిపి ఆ తరువాత మరిచిపోయాయి. అప్పుల బాధతో రైతుఆత్మహత్య చేసుకుంటే అదేదో ప్రభుత్వం పథకం కింద 5లక్షలు ఇస్తుందే తప్ప మరో రైతు, మరో వ్యక్తి అప్పుల ఊబిలో బలి కాకుండా శాశ్వత పరిష్కారమార్గాల ప్రయత్నాలే చేయడం లేదు..
అప్పు తీసుకో.. ఆస్తి సంపాదించుకో.. అంటూ ఆఫర్లు ప్రకటిస్తూ మూలకు కూర్చున్న వాడిని తట్టి లేపి తంటాల్లో పడేస్తున్నాయి.. అప్పు లేనివాడికి ఓ నెల ఓ సంవత్సరంలా కనబడుతుంటే... అప్పు చేసిన పాపానికి ఒక నెల ఒక్క రోజుతో సమానమైనట్లు తెలుస్తోంది.. ఉన్ననాడు ఉన్నంతలో గడిపి లేనినాడు పస్తులుండే ప్రాణాలు నేడు అప్పుల కుంపటిలో పడి గిలగిల కొట్టుకుంటున్నాయి. అమ్మో ఒకటో తారీఖు మద్యతరగతివాడి తిప్పలు సినిమా మాదిరిగానే ఇప్పుడు అన్ని వర్గాల వారిని అప్పులు తిప్పలు పెడుతున్నాయి. కేవలం మద్య తరగతివాడేనని కాదు.. రోజు కూలి చేసుకునే వాళ్ల నుంచి కుబేరుల వరకు అప్పుల ముప్పులో మునిగి తేలుతున్నారంటే ... ప్రస్తుత పరిస్థితులకు కారణమెవ్వరు..
అప్పుల బాధపై ఓ చిన్న కుటుంబం గాధను చూస్తే... ఓ రైతు బిడ్డ తన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి అయిన సాగుభూమిలో కష్టపడి వ్యవసాయం చేస్తూ వచ్చినదాంట్లో కొంత దాచుకొని కొంత ఖర్చు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. అయితే తాత సంపాదించిన భూమి తప్ప తాను సొంతంగా సంపాదించేమీ లేదనే వ్యద అతని మనసులో తొలచుతుంది.. ఎంతకాలం సాగుచేసినా మరో ఎకరం భూమి కొనలేనని, లేకపోతే ఓ అందమైన భవనం తన పిల్లలకు కట్టలేననే ఆలోచన అతనిలో మెదులుతుంది.. ఇంతలో అతనికి ఓ ఆఫర్ తగులుతుంది.. అదేంటంటే చిట్టి పాట.. కొందరు సభ్యులతో చిట్టి కట్టడం .. నెలకు కొంత మొత్తం కట్టడం అలా సభ్యులలో అవసరమున్న అప్పుగా తీసుకుని వడ్డితో సహా ప్రతినెల చెల్లించడం ఇలా 20 నెలలు, 40 నెలల పాట ఉంటుంది.. ఆ రైతు ఇదేదో బాగుంది.. నా అవసరం తీరుతుందనుకుని చిట్టిపాటలో చేరి ఇన్నాళ్లు కష్టపడి కూడబెట్టిన కొంచెం డబ్బును చిట్టీలో పెడతాడు.. ఆఫర్ ప్రకారం మొదటి చిట్టీ ఇతనికే దక్కుతుంది.. ఇంకేముంది. ఎగిరి గంతులేసి ఆ మొత్తంతో ఇళ్లు నిర్మాణం చేపడుతాడు.. ఇన్నాళ్లు ఏ బాధరబంధీ లేని అతనికి నెల గడవాలంటే ఓ సంవత్సరం కనిపించేది.. కానీ చిట్టీలో చేరే సరికి అతనికి అది ఒక్కరోజుగానే కనబడుతోంది. ఇక తన దినసరి పనులతో పాటు చిట్టి కోసం ప్రత్యేకంగా పనులు చేయడం మొదలు పెట్టాడు. ఆటో నడపడం, కూలికి వెళ్లడం , ఇతరత వ్యాపారాలు చేయడం, కూరగాయలు అమ్మడం లాంటి సైడ్ బిజినెస్ లతో తన చిట్టి పాట డబ్బులను అందించాలనే తపనలో పడ్డాడు.. వచ్చే ఆదాయ వనరులన్నీ బంద్ అయ్యాయి. చూస్తుండగానే ఆరునెలలు గడిచిపోయాయి.. చిట్టీ పాట, ఇంటి లోన్ బకాయలు పెరిగిపోయాయి. ఎక్కడ చేయి చాచకుండా ఇల్లు అమ్మకానికి పెట్టాడు.. కొనుగోలు చేసేవారే లేరు.. కొనే వారు దళారులు వచ్చి అడ్డికి పావుసేరు అన్నట్లుగా అడుగుతున్నారు. అదే దళారుల దగ్గర భూమి జాగా తీసుకోవాలంటే ఆకాశంలో ధర ఉంటుంది.. కానీ ఈ రైతు అమ్మితే అప్పులు పోను ఆతనికి మిగిలేదేమీ లేదని తెలుస్తోంది.. ఇలాంటి సమయంలో ఆ రైతు ఏం చేస్తాడు.. అదే మీరనుకుంటున్నదే.. ఆత్మహత్యనే.. చూశారు కదా ప్రశాంతంగా సాగిపోతున్న అతనికి అప్పుల కంపెనీలు తెచ్చిపెట్టిన తంటాలు..
వడ్డీ వ్యాపారం వ్యభిచారం కంటే నీచమైనదని పురాణాలు చెబుతుంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్ లైన్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి వడ్డీ వ్యాపారాలే అధికమయ్యాయి. చాలా వరకు ప్రైవేటు ఉద్యోగాలు , ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారిని టార్గెట్ చేసి కొన్ని కంపెనీలు , ముఖ్యంగా ప్రైవేట్ రంగంలోని బ్యాంక్ లు క్రెడిట్ కార్డులని, పర్సనల్ లోన్లని, హోం లోన్లని, ఇన్ స్టాంట్ లోన్లని ఆఫర్లు గుప్పిస్తున్నాయి.. అందరిని అప్పుల ఊబిలోకి లాగేస్తున్నాయి. ఒక నెల బకాయ అటు ఇటు అయిందో అంతే సంగతులు ముక్కు పిండి అధిక వడ్డీ వసూలు చేసి మళ్లీ సదరు వ్యక్తి కోలుకోకూకుండా కొంపలు ముంచేస్తున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా ప్రైవేటు చిట్ కంపెనీలు, లోన్ కంపెనీలు వెలసి సామాన్య జీవితాలను చిన్నా భిన్నం చేసేస్తున్న పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలుసు.. అంటే అలా అప్పులిచ్చే కంపెనీలన్నీ మన పురాణాల ప్రకారం వ్యభిచార ముఠాలేనా.. అంతకు దిగజారిన సంస్థలేనా అంటే అవుననే చెప్పాలి.. ఎక్కడో అవసరం లేనివారిని సైతం ఆశపెట్టి ఆఫర్లు చెప్పి అప్పుల ఊబిలోకి లాగడం .. ఆ తరువాత వారి ప్రాణలు పోవడానికి కారణమవుతున్న కంపెనీలకు ఎవరిచ్చారు అధికారం.. పుణ్య దేశమైన భారతదేశంలో ఇలాంటి వ్యభిచార కంపెనీలు ఎందుకు.. ? వీరికి అనుమతులు ఎవరు ఇచ్చారు..? ఇలాంటి కంపెనీలు దేశంలో అవసరమా... ? రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క గడపకు పోతే ఇలాంటి క్రెడిట్, చిట్స్ పాటల చింతలే ఉంటాయి.. వీటి వలన కుటుంబ బంధాలు దూరమవుతున్నాయి. మానాభిమానాలు మంట కలిసిపోతున్నాయి. అసలు బంధుత్వాలకు సమయమే లేకుండా పోయింది..
చాలా ధనిక కుటుంబాల్లో బంధుత్వాలు చాలా తక్కువగా ఉంటాయనేది ఒక్కప్పటి మాట.. గత 20 ,30 ఏళ్ల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో బంధుత్వాలకు ఎంతో విలువుండేది.. ప్రస్తుతం పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఎలా డబ్బు సంపాదించాలే.. ఎలా అప్పులు తీర్చాలే ఆలోచనలే తప్పా.. ఆప్యాయతలు, అనురాగాలు సగటు మనిషికి లేకుండా పోయింది.. అప్పుల భయంతో కొందరు పనులు చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటూ మరింత అప్పుల ఊబిలో పడిపోతున్న పరిస్థితులు ప్రతి గ్రామంలో కనపడుతోంది.. తెలంగాణలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి చూడొచ్చు.. పొద్దున లేస్తే మహిళా సంఘాల నుంచి పంట చిట్టీలు, పొదుపు సంఘాలు ఇలా అనేక రకాల అప్పుల కంపెనీల వసూల్లే కనబడుతున్నాయి..
ప్రభుత్వాలు తలచుకుంటే ఈ రొంపి వ్యవస్థను మార్చేయచ్చు కదా..? ప్రామిసరీ నోటును రద్దు చేయోచ్చు కదా.. అప్పులు కావాలనుకునే వారికి ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఇప్పుడిస్తున్నట్లు అప్పులు ఇప్పించవచ్చుకదా..? ఇవన్నీ చేయకుండా ప్రైవేట్ రంగం వారికి అనుమతులు ఇచ్చే వారిచ్చే పన్నులకు ఆశపడో లేక ప్రభుత్వంలోని పెద్దల కంపెనీలు కావడమే కారణమా..? ఇలాంటి వ్యవస్థ నుంచి ప్రజలను కాపాడే మార్గం ప్రభుత్వాలకు లేదా.. అసలు ఈ వ్యభిచారం ప్రభుత్వాలే చేయిస్తున్నాయా.. ఓ సామాన్యుడిగా తట్టిన సందేహాలు.. నేడు ప్రపంచ మానవత్వ దినోత్సవం సందర్భంగా మానవతావిలువలు మంటకలిసిపోవడానికి కారణమైన క్రెడిట్ కంపెనీల వ్యభిచార వడ్డీల మేధావి వర్గాలు ఆలోచిస్తాయని ఆశిస్తూ.. రఫీ మహ్మద్ , ఫ్రీలాన్స్ జర్నలిస్ట్