వార్తలు విశ్లేషణలు

9, సెప్టెంబర్ 2021, గురువారం

పంచాయితీరాజ్ శాఖ ఉత్తర్వులు బేఖాతరు


పంచాయితీరాజ్ శాఖ ఉత్తర్వులు బేఖాతరు
యధేచ్ఛగా ప్రజాప్రతినిధుల సంబంధీకుల జోక్యం
ప్రజాప్రతినిధుల తీర్మానాల్లో వాళ్లదే పెత్తనం
అధికారిక సమావేశాల్లో అనధికారిక ప్రవేశం
చిరుద్యోగులపై చిందులేసే చిల్లర నేతలు
సర్పంచ్, ఎంపిటీసీ, ఎంపీపీ భర్తల బరితెగింపు
భార్యల పదవులతో బినామీ రాజకీయాలు
ఏకగ్రీవంగా ఎన్నికైన మహిళలకు లేని స్వేచ్ఛ
ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలే 
రాజకీయమంతా వాళ్ల భర్తలు, బంధువులదే
అడ్డగోలు పంచాయితీ సెటిల్ మెంట్ల దందా
అధికారులను దబాయించి  బిల్లులెత్తి
చేతివాటాలకు ప్రజాధనం దుర్వినియోగం
అడిగిన వారు కంటు.. మాకేందుకులే రిస్కు
హైదరాబాద్, ప్రజాజ్వాల:
 పంచాయితీ రాజ్ శాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారు బినామీ నేతలు. గ్రామసభలు, మండల పరిషత్ సమావేశాల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన మహిళలకు బదులుగా వారి భర్తలు, కొడుకులు , తదితర బంధువులు పాల్గొని పంచాయితీ తీర్మానాలు చేసేస్తున్నారు. దర్జాగా పనులు చేసినట్లు చూపించుకొని బిల్లులు దండుకుంటున్న వైనం నియోజకవర్గంలోని మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రతిగ్రామం, మండలంలో స్పష్టంగా కనబడుతోంది. ఒక గ్రామంలో తల్లి సర్పంచ్.. పండు ముదుసలి.. మంచానపడి చాలా కాలమైంది.. ఇంటి వెనుక ఓ షెడ్డులో ఆమె ఉంటుంది.. కానీ ఆ గ్రామ రాజకీయమంతా ఆమె చిన్నకొడుకు చేస్తాడు.. అధికారులు ఎవరు వచ్చిన ఆయన చెప్పినదే వింటారు .. ఆయననే సంప్రదిస్తారు.. అసలు ఆమెకు గ్రామ సభ అంటే ఎంటో తెలియదు.. గ్రామపంచాయితీ సెక్రటరీ ఎవరో తెలియదు.. దర్జాగా డబ్బులు దండుకొన్న కొడుకు మాత్రం రెండంతస్తుల ఇల్లు కట్టుకున్నాడు.. ఇదీ రాజకీయం.. ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన మహిళ సర్పంచ్ ది మరో కథ.. అసలు గ్రామపంచాయితీలో ఏం జరుగుతుందో తెలియదు.. రోజు పొద్దున్నే తోటి మహిళలతో కూలీ కి పోవడమే ఆమెకు తెలుసు.. ఆమె భర్త, మామలు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తుంది.. అవన్నీ వాళ్లే చూసుకుంటారని తాపీ చెప్పి తన పని తాను చేసుకుంటూ పోతుంది.. మరోచోట భార్య ఎంపీటీసీగా ఎన్నికైన సంగతికూడా ఆమెకు తెలియదు. భర్త ఏం రాజకీయం చేస్తున్నాడో తెలియదు.. ఒక్కోక్క సారి కొందరు ప్రత్యేక అధికారులు వచ్చినప్పుడు మాత్రం వీళ్లను ముస్తాబు చేయించుకొని ఆయా సభలకు, సమావేశాలకు తీసుకెళ్లి వాళ్లతో పాటు వీళ్లు కూడా కూర్చుని పనికానిచ్చేస్తారు.. కాదు కూడదు అంటే పై నున్న మంత్రివర్గం నుంచి ఒత్తిడి తీసుకొస్తారు. స్వాతంత్ర్యం వచ్చి75 ఏళ్లు గడిచినా ఇలాంటి నిరంకుశ వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా మహిళలన అభ్యున్నతికి రాజకీయాల్లో మహిళల కోసం, చట్టసభలలో వారికి సముచితస్థానం కల్పించాలని నిర్దేశించబడిన అవకాశాలు అడ్డదారి తొక్కుతున్నాయి.. అయితే ఈ నియోజకవర్గంలో ఇటీవల హరితహారం, మిషన్ భగీరథ పనులు చేపట్టడానికి వచ్చిన ప్రత్యేక అధికారులు కొన్ని గ్రామాలు, మండలాల్లో పరిస్థితిని గమనించి , వాళ్లకు స్వేచ్ఛ లేకుండా పోయిందని వాపోయారు. కానీ తమకు ఎందుకు వచ్చిన రిస్కు అంటూ చూసిచూడనట్లు వెళ్లిపోయారు.. అలాంటప్పుడు పంచాయత్ రాజ్ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు కేవలం కలెక్టర్ల వరకే పరిమితమైనట్లేనా..?  
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్