వార్తలు విశ్లేషణలు

12, డిసెంబర్ 2021, ఆదివారం

ఆన్ లైన్ పర్సనల్ లోన్ పరేషాన్


ఆన్ లైన్ పర్సనల్ లోన్  పరేషాన్
ఈమెయిల్ లో ఈజీ లోన్ అప్లికేషన్
క్లిక్ చేస్తే చాలు సులువుగా అప్లై
ఆదార్, పాన్ కార్డు ఉంటే చాలు
ఆదాయం అక్కర్లేకుండానే లోన్
సులువైన నెలసరి వాయిదా పద్దతి
అన్నీ బాగున్నాయంటే అంతే గతి
నెల వాయిదా తీర్చకుంటే తప్పదు తలనొప్పి

మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా.. ఉండే ఉంటుంది.. అందులో జీమెయిల్ , వాట్సాప్ , ఇతరతర యాప్ లు ఉండే ఉంటాయి. ఇంకేముందీ ఏ యాప్ ఓపెన్ చేసిన పేరొందిన ప్రైవేటు బ్యాంక్ ల యాడ్స్ పరేషాన్ చేస్తుంటాయి. ఆర్ధిక ఇబ్బందులున్న చిన్నచిన్న కంపెనీల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు అవసరం కొద్ది వాటిని క్లిక్ చేస్తే క్షణాల్లో అకౌంట్ లో అడిగినంత అమౌంట్ వచ్చేస్తుంది. అక్కడ అవసరం తీరినా  అసలు తంటాలు ఎప్పుడు మొదలవుతాయంటే.. నెలసరి వాయిదా చెల్లించేటప్పుడు.. ఆదాయ వనరులు చూడకుండానే లోన్ లు ఇస్తున్నాయి కొన్ని బ్యాంక్ లు.. అలా తీసుకున్న వారు నెలసరి వాయిదా చెల్లించకుంటే ఫోన్ లు చేసి, రికవరీ ఏజెంట్లను ఇంటికి పంపి వసూళ్లు చేస్తుంటాయి. లోన్ మంజూరు చేసి, అకౌంట్ లో డబ్బులు వేసేవరకు రానీ బ్యాంక్ సిబ్బంది ఒకటి రెండు వాయిదాల సమయం దాటిపోయేవరకు వేచి ఉండి ఆ తరువాత రికవరీ సిబ్బందిని పంపించి వసూళ్లు చేస్తుంటారు.. చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసే వారు నెల జీతం మీద ఆధారపడే వారు లోన్ తీసుకుంటే వారి జీతం నుంచి వాయిదా చెల్లించడం సులభతరమే.. కానీ కొన్ని కంపెనీల్లో జీతాలు సమయానికి ఇవ్వని యాజమాన్యాలు, అసలు ఉద్యోగం చేయని వారు మాత్రం ఇలాంటి యాప్ లద్వారా లోన్ లు తీసుకుంటే.. మాత్రం ఇబ్బందులు తప్పవు.

ఓ వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో  ఉద్యోగం చేస్తున్నాడు.. అతడికి అత్యవసరంగా డబ్బు అవసరం పడింది. ఆన్ లైన్ లో లోన్  అప్లికేషన్ లో వివరాలు ఇచ్చేశాడు. అటు నుంచి ఫోన్ వచ్చింది. అతని వివరాలు మొత్తం చెప్పాడు.. నిమిషాల్లో అతని అకౌంట్లో డబ్బు పడింది. హమ్మయ్యా అని ఆ అత్యవసర సమయం దాటిపోయిందనుకున్నాడు. కొన్ని నెలలు అతని కంపెనీ బాగానే నడిచింది. నెలనెల వాయిదా క్రమం తప్పకుండా ఇచ్చేస్తున్నాడు. ఆ తరువాత కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కంపెనీ జీతాలు ఇవ్వడం మానేసింది. ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో తీసుకున్న లోన్ కు వాయిదాలు బకాయలు పడ్డాయి.. లోన్ ఇచ్చిన బ్యాంక్ వాళ్లు ఫోన్ లు చేస్తున్నారు. ఇతను మరో పనికి కుదరలేక పోతున్నాడు. ఇటువంటి సమయంలో ఏం చేయాలో తెలియక అతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. బ్యాంక్ వాళ్లు ఏదైతే అత్యవసర సమయంలో డబ్బు ఇచ్చి ఆదుకున్నారో.. అదే విధంగా  లోన్ వసూల్లు చేసేవారి హింసకు ఆత్మహత్య చేసుకునేలా చేశారు..

ఇటీవల కాలంలో అనేక బ్యాంక్ లు కేవలం పాన్ , ఆధార్ కార్డులతో అత్యధికంగా లోన్ లు ఇవ్వడం మామూలు అయ్యింది. సిబిల్ అనేది చెక్ చేయడం , లోన్ మంజూరు చేయడం సులువుగా ఉంది. చాలా మంది ఆర్ధిక స్థితి, ఆదాయ మార్గాలతో సంబంధం లేకుండా లోన్లు ఇవ్వడం, అధిక వడ్డీలతో నెలసరి వాయిదాలు పొందడం బ్యాంక్ లు ఆఫర్ల పేరుతో  ఆకట్టుకుంటున్నాయి. అవసరం లేకున్నా వాళ్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్శితులై లోన్ లు తీసుకుంటున్న వారు ఆ తరువాత వాయిదాలు చెల్లించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఆఖరికి ఉద్యోగాలు లేని వారు , ఉన్న ఉద్యోగంలో జీత భత్యాల భద్రత లేని వారు అనేక ఇబ్బందులలో ప్రాణాలు ఫణంగా పెడుతున్న సంఘటనలు కలవరపెడుతున్నాయి.. 

ఇటువంటి యాప్ లు, ఆన్ లైన్ లోన్ ల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అడ్డగోలుగా  రుణాలు ఇచ్చేస్తూ అధిక వడ్డీ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు రంగం బ్యాంకులను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అమాయక జనాలకు ఆఫర్ల పేరుతో ఆకట్టుకోవడం, అప్పుల ఊబిలోకి దించడం మోసం చేయడమే అని గ్రహించి ఆన్ లైన్ అప్పుల పై  చర్యలు చేపట్టాలి..

9, డిసెంబర్ 2021, గురువారం

అన్నదాత ఆత్మఘోష


*అప్పు చేస్తే ఆత్మహత్యే పరిష్కారమా?
*అన్నదాతకు ఆర్ధిక ఇబ్బందులెందుకు?
*అప్పు చేసి అందరికి ఉపాదికల్పించినందుకా?
*అప్పు చేసి నష్టాన్ని భరించినందుకా?
*అప్పు చేసి ప్రపంచానికి అన్నం పెట్టినందుకా?
*చేసిన అప్పుతో విలాసవంత జీవితం గడపనందుకా?
*చేసిన అప్పు పెట్టుబడికి పెట్టి దిగుబడి రాకపోతే తప్పా?
*ప్రకృతి ప్రకోపానికి నష్టపోతే రైతే బాధ్యుడా? 
*అప్పులిచ్చే వారు అధిక వడ్డీలు వసూలు చేసి దర్జాగా ఉంటారా?
*అప్పులు చేసి కార్మికులకు పని కల్పించిన రైతు చావాలా?
*అన్నపూర్ణం దేశంలో అన్నదాత ఆత్మహత్యలెందుకు?
============================
అన్నపూర్ణ దేశం భారత దేశం.. ప్రపంచానికి ధాన్యాగారం నా భారతం.. అలాంటి భారత దేశానికి వెన్నెముక అన్నదాత... వ్యవసాయం చేసే ఓ సామాన్య శ్రామికుడు రైతు.. నేడు రైతు ఆత్మఘోష ఘోషిస్తుంది. తాతల నాటి భూమిని సాగు చేస్తూ అందరికి అన్నం పెట్టే రైతు గుండే నేడు ఆగిపోతుంది. రాజుల కాలం నుంచి రైతాంగంపైనే అందరి జీవితాలు కొనసాగాయి. అప్పటి నుంచి రైతులను హింసించి, బెదిరించి శిస్తుల పేర్లతో నయవంచన చేసి వారి కష్టాన్ని దోచుకునే వాళ్లని చరిత్రలో కథనాలున్నాయి.. తరతరాలుగా కష్టం చేసి అందరికి అన్నంపెట్టే  అమాయక జీవి అరాచకాలకు బానిసైపోతూనే ఉన్నాడు.. స్వరాజ్యంలోనూ ఏనాడు రైతుకు ఇన్ని కష్టాలు రాలేదు.. కానీ నేడు రైతే రాజు అనే మాట ... రైతే ధౌర్భాగ్యుడనేలా మారింది.

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎంతో మంది రైతులు బలయ్యారు. ఇప్పటి వరకు బలైన రైతుల విషయాల్లో ఏవో కొన్ని మాత్రం ఇతర కారణాలతో ఆత్మహత్యలైతే... అత్యధికంగా రైతులు ఆర్ధిక ఇబ్బందులు, అప్పుల బాధలతోనే చనిపోతున్నారనేది వాస్తవం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతే రాజు అని.. రైతుబంధు లాంటి మహోత్తమ పథకాలను అమలు చేస్తున్నా... రైతు బీమా లాంటి పథకాలు.. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలతో రైతులకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నా... రైతు ఆత్మహత్యలు మాత్రం కలవరపెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో చోట ఓ రైతు కుటుంబం రోడ్డున పడుతుంది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సహకారం గొప్పగా ఉన్నా... అసలు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారనే దానిపై పాలనా యంత్రాంగం ఎందుకు చర్చించడంలేదో తెలియదు..

పంట రుణాలు ఇచ్చిన బ్యాంకులు వడ్డీలు తీసుకుని బాగానే ఉంటాయి.. వడ్డీకి ఇచ్చిన ప్రైవేటు కంపెనీలు బాగానే ఉంటాయి.  అప్పు చేసి పెట్టుబడి పెట్టి ప్రకృతి ప్రకోపానికి నష్టపోయిన రైతు మాత్రం ఆత్మహత్య చేసుకోవడం దారుణమైన పరిస్థితి.. చాలా మంది రైతులు చేసిన అప్పులతో వారి వ్యవసాయ క్షేత్రాల్లో పెట్టుబడికి మాత్రమే వినియోగిస్తున్నారనేది అందరికి తెలిసిన విషయమే.. ఓ హెక్టారు భూమి ఉన్న రైతు ఓ పంట వేయడానికి పెట్టుబడి నిమిత్తం తెచ్చిన అప్పును ఖర్చు చేస్తాడు.. అతన వ్యవసాయం చేయడం వలన ఎంతో మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి లభిస్తుంది. ఎంతో మంది యంత్ర పరికరాలున్న వారికి పని దొరుకుతుంది. విత్తన కంపెనీలకు విత్తనాలు అమ్ముడు పోతాయి. పురుగు మందుల కంపెనీల మందులు అమ్ముడుపోతాయి. ప్రభుత్వానికి రావాల్సిన పన్ను వస్తుంది.. ఇన్ని చేసినా ఆఖరికి నోటికాడికి వచ్చిన పంట అకాల వర్షంతోనో... ప్రకృతి వైపరిత్యంతోనో దిగుబడి రాకపోతే... ఆ రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా...

కొత్తగా రైతు చట్టాలు చేసినా... వాటిని రద్దు చేసినా పెద్ద ప్రతిఫలం లేదు.. రైతు పెట్టుబడికి పెడుతున్న అప్పుల పై ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.. రైతుబంధుతో రైతు కష్టాలు తీరుతున్నాయా? ఆలోచన చేయాలి.. రైతు బీమాతో రైతుకుటుంబాల బాధ తీరుతుందా.. ? ఎందుకీ పరిస్థితి నెలకొంటుంది. భూమి ఉన్న ప్రతి రైతు బాధలు పడాల్సిందేనా..? నష్టాలు భరించాల్సిందేనా? లేదంటే వ్యవసాయం చేయడం మానుకోవాలా?  రైతు ఏడ్చిన దేశం ఎన్నడూ బాగుపడదని పెద్దలు చెబుతుంటారు.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం అరిష్టమంటారు.. అలాంటి రైతు ఘోషను ఎందుకు పట్టించుకోవడం లేదు.. రోజుకో చోట ఉరి పెట్టుకుంటున్న అన్నదాతకు జీవించే హక్కు లేదా... అప్పు చేస్తే , అది తీర్చకుంటే... చావే శరణ్యమా?  మేధావులు ఎంతోమంది ఎన్నో అంశాలపై చర్చించే వారు రైతు బలవన్మరణాలపై చర్చించాలి.. అప్పు చేసిన రైతు ఆత్మహత్య చేసుకోకుండా ప్రత్యామ్నాయంగా భరోసా కల్పించే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి.. 

ప్రస్తుతం తెలంగాణలో వరి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.. చేసిన అప్పుకు వడ్డీకి వడ్డీ పెరుగుతుంది తప్పా... పండించిన పంటకు గిట్టుబాటు రావడం లేదని... వడ్డీ ఎలా తీర్చేదని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు ఇచ్చిన వాళ్లు అందెలమెక్కి కూర్చుంటున్నారు. విత్తనం అమ్మిన వారు , పురుగుమందులు, ఎరువులు అమ్మిన వారు ఆనందంగానే ఉన్నారు.. ఆఖరికి అప్పుచేసి వారందరికి ఉపయోగపడిన రైతు మాత్రం ఉరికంబమెక్కడం ఎంతవరకు సమంజసం.. ఇప్పటికైనా రైతు సమస్యలపై  సుధీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం దేశంలోని ప్రతి ఒక్కరిపై ఉంది. రైతులు లేకుంటే దేశం లేదనేది గ్రహించాల్సిన బాధ్యత రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలతో పాటు అన్ని వ్యవస్థలు ఆలోచించాలి.. ఆదుకోవాలని కోరుతూ... 

రఫీ, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్..

8, డిసెంబర్ 2021, బుధవారం

మాస్క్ లేకుంటే కాప్స్ షాక్ తప్పదు



మాస్క్ లేకుంటే కాప్స్ షాక్

సాఫ్ట్ గా కాప్స్  సర్చ్ 

ఓన్లీ ఫైన్ నో లాఠీ చార్జ్

లైట్ తీసుకుంటున్న పబ్లిక్

మూడో వేవ్ పై నిర్లక్ష్య వైఖరి

మాస్క్ లేకుండా రోడ్లపై జనం

గుంపులు గుంపులుగా దావతులు

దర్జాగా తిరుగుతున్న జనం

పొంచి ఉన్న ప్రమాదంపై పోలీసుల పరేషాన్
మాస్క్ లేకుంటే పోలీస్ షాక్ తప్పదు.. మళ్లీ మొదలైందీ పోలీసులకు లొల్లి.. మన కోసమే .. మనందరి కోసమే మాస్క్ తప్పని సరి అంటున్నారు మన కాప్స్. మొదటి లాక్ డౌన్ లా కాకుండా సాఫ్ట్ గా సమజయ్యేలా సర్ధి చెబుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై తనిఖీలు పెట్టి హెల్మెట్ లేకుంటే జరిమానా విధిస్తూ.. మాస్క్ లేకుంటే 1000 జరిమానా అని బెదిరిస్తూ డ్యూటీలు చేస్తున్న కాప్స్ ... కాస్త కనికరం చూపిస్తున్నారంటే అర్ధం చేసుకోవాలే... అప్పటి లాగా అంత కఠినంగా వ్యవహరించకుండా వారు డ్యూటీలు చేస్తున్నారంటే మనం అర్ధం చేసుకోవాలే కదా...కోవిడ్ తో మన కాప్స్ కష్టాలపై కబుర్లు చూద్దామా..?
ఇదిగో ఇక్కడ చూడండి జనం.. అక్కడెక్కడో మూలకు పోలీసులు తనిఖీలు చేస్తున్నట్లున్నారు.. వీళ్ల మోహాలకు మాస్క్ లు లేవు.. అందుకే అక్కడ పోలీసులు ఎప్పుడు వెళ్లిపోతారా అని వందమీటర్ల దూరంలో నక్కి నక్కి తొంగి చూస్తున్నారు... ఈ జనాలు... పది రూపాయల మాస్క్ మొఖానికి తగిలించుకుంటే పోయేదేముంది .. ఎందుకు కాప్స్ ముందు నామూష్ కావడం.. పట్టుబడితే ఫైన్ కట్టడం అవసరమా.. ? హెల్మెట్, మాస్క్ ధరించిన వారు దర్జగా వెళ్లిపోతుంటే.. వీళ్లు మాత్రం డైవర్షన్ రూట్లు వెతుక్కుంటూ నానా తంటాలు పడుతున్న పరిస్థితి. 
కోవిడ్ మహమ్మారి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు కష్టాలు తప్పడం లేదు. మొదటి దశ లాక్ డౌన్ సమయంలో చాలా కఠినంగా వ్యవహరించిన కాప్స్ ఈ సారి చాలా తగ్గిపోయారు. కేవలం జరిమానాలతో సరిపెట్టేస్తున్నారు.. జరిమానాలు కూడా విధించడంలో కూడా వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. అసలే ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న వారిని  ఎందుకు ఇబ్బందులకు గురిచేయాలా అని మానవతాకోణంలో ఆలోచిస్తున్నారో ఏమో కానీ చాలా చోట్లలో సున్నితంగా హెచ్చరించి వదిలేస్తున్నారు.. మూడో వేవ్ అత్యంత ప్రమాదకరమైనదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ తప్పనిసరి అని సూచనలు చేస్తూ.. మాస్క్ లేకుంటే వెయ్యి జరిమానా అంటూ హెచ్చరికలతో ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు మన తెలంగాణ కాప్స్...
తొలిదశ కోవిడ్ మహమ్మారికి చాలా మంది పోలీసులు బలిదానం చేశారు. డ్యూటీలో చేరి కోవిడ్ బారిన పడి కుటుంబాలకు దూరమయ్యారు. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనా కట్టడికి పాటుపడ్డారు.. అటువంటి పోలీసులు ఒకానొక క్షణంలో ఓర్పు, సహనం కోల్పోయి నిబంధనలు ఉల్లంఘించిన వారి భరతం పట్టిన సందర్భాల్లు అనేకం ఉన్నాయి..లాఠీ చార్జులు చేస్తూ అందరిని కట్టడి చేసిన పోలీసుల వలనే మనమంతా కోవిడ్ బారి నుంచి తప్పించుకో గలిగామని గుర్తించాల్సిన అవసరముంది. వైద్యులు వైద్య సేవలు చేసినప్పటికి మన కాప్స్ కంట్రోల్ చేయడంతోనే మనం బతికి ఉన్నామని చెప్పుకోవాలి.. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు సరైన అవగాహన పెంచుకుని మాస్క్ తప్పనిసరిగా ధరించి మన కాప్స్ కష్టాలు తగ్గించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైనా ఉంది...
ప్రస్తుతం మన రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మూడో వేవ్ కేసులు రాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మాస్క్  లేకుండా బయట తిరిగేవారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అయినా ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు.. మాస్క్ లేకుండా గుంపుగుంపులుగా తిరుగుతూ.. పెళ్లీల సీజన్ లో నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తూ కాప్స్ కు కోపం వచ్చే పనులు చేస్తున్నారు.. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. కాప్స్ ను కష్టపెట్టకుండా నిబంధనలు పాటించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది... 
పోలీసులు చాలా సున్నితంగా వ్యవహరిస్తుండటంతో జనం పట్టించుకోవడం లేదా.. ?  మరి ఇలా అయితే మూడో ముప్పు ముంచుకొస్తే... కాప్స్ అసలు రూపం బయటకు రాకా తప్పదని హెచ్చరిస్తూ.... రఫీ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్..

వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్