వార్తలు విశ్లేషణలు

24, అక్టోబర్ 2021, ఆదివారం

కేసీఆర్ ప్రసంగం కీలకం



కేసీఆర్ ప్రసంగం కీలకం
*హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠభరితం
*కీలకం కానున్న కేసీఆర్ ప్రచారం
*5 నెలల నుంచి గొంతు చించుకున్న ఈటల
*మూడు రోజుల్లో తారుమారయ్యే పరిణామాలు
*ముందు నుంచి మందకొడిగా కాంగ్రెస్ ప్రచారం 
*కేసీఆర్ ప్రసంగిస్తే ప్రజలు  ప్రభావితమవుతారా?
*పరేషానవుతున్న  బీజేపీ, కాంగ్రెస్ నేతలు
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓ బాహుబలి సినిమా విడుదలను తలపిస్తుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి హుజూరాబాద్ పదం తెలంగాణ మొత్తం మారుమోగుతోంది. ఆత్మగౌరవం అంటూ ఈటల ప్రచారం... అధికార దుర్వినియోగం చేశాడని టీఆర్ఎస్ ప్రచారం మధ్య ఉత్కంఠభరితంగా ప్రచారపర్వం కొనసాగింది. ఇదిగో అదిగో అంటూ నాలుగు నెలల తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. చకచక నామినేషన్ల పర్వం పూర్తయింది.. ఉపసంహరణలు అయ్యాయి.. అంతా సవ్యంగా సాగుతోంది.. అయితే రాజీనామా చేసినప్పటి నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలోనే పర్యటిస్తూ... బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ప్రజాభిమానం పెద్ద మొత్తంలో చూరగొన్నారు.. పలు చానల్లు చేపట్టిన సర్వేలు సైతం ఈటల రాజేందర్ కు 80 శాతం ఓట్లు పడుతాయని చెప్పుకొచ్చాయి.. ఇప్పటికి అదే చెబుతున్నాయ్.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకు కాముగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటించి కాస్తో కూస్తో ప్రచారం ముమ్మరం చేసింది.. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ నేతలంతా అభ్యర్థి తరపున ప్రచారం చేస్తూనే ఉన్నారు కానీ అంతగా వారి ప్రభావం కనబడటం లేదనే చెప్పుకోవాలి. ప్రధానంగా పోటీ కేసీఆర్ , ఈటలకు మధ్యనే అన్నట్లుగా అంతా ఫిక్స్ అయ్యారు. 
ఇప్పటి వరకు ఈటల రాజేందర్ ఎక్కడికి వెళ్లిన ప్రజలు పెద్ద సంఖ్యలో బ్రహ్మరథం పడుతున్నారు. బీజేపీ పెద్దలంతా మద్దతు తెలిపి ఈటల గెలుపుకోసం పాటుపడుతున్నారు.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మాజీ మంత్రులు , పార్టీ నేతలంతా ప్రచారంలో ముమ్మరంగా ముందుకు సాగుతున్నారు.. ఈటల సతీమణి జమున ఇంటింటి ప్రచారంతో ప్రజలకు చాలా చేరువయ్యారు. మంగళహారతులు పట్టి స్వాగతం పలుకుతున్న తీరు చూస్తే ఈటల గెలుపు ఖాయమని చెబుతున్నాయ్ సర్వేలు.. అయితే ఇప్పుడు ఒకే ఒక గండం ఉందని చెప్పుకుంటున్నారు ఈటల అనుచరులు. ఈ గండం తప్పితే ఈటల గెలుపు తథ్యమంటున్నారు.. 
అదే... కేసీఆర్ ప్రసంగం... ఈ నెల 26, 27 న కేసీఆర్ హుజూరాబాద్ లో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే హుస్నాబాద్ లో బహిరంగ సభ పెట్టాలని యోచిస్తున్నా.. ఎన్నికల నిబంధనల ప్రకారం బహిరంగ సభకు అనుమతి లభించకపోవచ్చు అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రోడ్ షో ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అది కూడా వరుసగా రెండు మూడు రోజులు రోడ్ షో చేయనున్నట్లు సమాచారం. దీంతో కాషాయశ్రేణులు కంగారుపడుతున్నాయి.. ఎందుకంటే సీఎం కేసీఆర్ మాటల మాంత్రికుడని, మాటల్తో కోటలు కట్టేస్తాడని, ఇన్ని రోజుల ఈటల కష్టాన్ని తుంగలో తొక్కేస్తాడేమోనని మదనపడుతున్నారు. ఇది ఈటలకు అతి పెద్ద గండంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల్లో ఎక్కడైనా చివరి రోజుల్లో ప్రచారం లో పాల్గొంటే అంతే స్వల్ప మెజారిటీతోనైనా సరే నెగ్గుతున్నారని, సాగర్ లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అదే జరిగిందని , హుజూరాబాద్ లో కూడా అదే జరుగుతుందేమో ననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.. గతంలో దుబ్బాకలో అంతా బాధ్యత మంత్రి హరీశ్ రావు తీసుకోవడంతో సీఎం కేసీఆర్ అక్కడకు వెళ్లలేదు... అది మైనస్ అయ్యి బీజేపీకి ప్లస్ అయ్యిందని,  అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా బీజేపీ పాట పాడుతున్నా... ఆఖరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించే ప్రసంగం కేసీఆర్ దని పరేషాన్ లో ఉన్నారని తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ కూడా పెద్దగా కష్టపడకుండా ఇంటికో ఓటు అడుగుతుందని, డిపాజిట్ కోసం , భవిష్యత్తు ఉనికి కోసం పోరాడుతుందని చెప్పుకుంటున్నారు..  పెద్దగా కష్టపడినా  కేసీఆర్ వస్తే వాళ్ల కష్టం మీద నీళ్లు చల్లినట్లే అన్న భావనలో కాంగ్రెస్ ఉందంటున్నారు.. 
మొత్తానికి మూడు రోజులు తమ ఓటర్లు ప్రభావితం కాకుండా ఉండటానికి వ్యూహాలు రచిస్తున్నారు... కీలకం కానున్న కేసీఆర్ ప్రసంగం లేకుండా  చేయడానికి ఎత్తులు వేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఎన్నికల నిబంధనల్లో బహిరంగ సభలకు అనుమతి ఉండదని, తెలుస్తోంది.. అయితే నోటిఫికేషన్ రాక ముందు రెండు సార్లు సీఎం కేసీఆర్ దళిత బంధు పేరుతో హుజూరాబాద్ కు వచ్చారు.. అప్పడు పెద్ద సంఖ్యలో జన సమీకరణ జరిగింది.. ఇతర ప్రాంతాల నుంచి జనం వచ్చారని కవర్ చేసినా ఈటల వర్గీయులు సీఎం కేసీఆర్ ప్రచారం ఉండదని భావిస్తున్నారు... సీఎం కేసీఆర్ హుజూరాబాద్ బాధ్యత అంతా హరీశ్ రావు కు అప్పగించారని, అందుకే ఆయన ప్రచారం ఉండబోదని అనుకున్నారు.. కానీ పరిణామాలు తారుమారు అయ్యే పరిస్థితి వచ్చే సరికి సీఎం కేసీఆర్ ప్రచార హోరు షూరు కానుందని తెలుస్తోంది.. అంతా ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రచార పర్వం పైనే ఎదురు చూస్తున్నారు. 
మరో వారంలో ఉత్కంఠతకు తెరపడనుంది... హుజూరాబాద్ పేరును ఇప్పటికే బద్నాం చేశారంటున్నారు.. ఎన్నికల పేరుతో హజూర్ బార్ గా,, జీ హుజూర్ గా పేర్లు మార్చి పడేశారు... ఆత్మగౌరవమా..అభివృద్ధి నా ఈ త్రిముఖ పోరులో నెగ్గెదెవరో  వేచి చూడాల్సిందే....

కేసీఆర్ కు బీజేపీతో పొత్తు కాంగ్రెస్ టీఆర్ఎస్ కు తొత్తు

కేసీఆర్ కు బీజేపీతో పొత్తు
కాంగ్రెస్ టీఆర్ఎస్ కు తొత్తు
*విద్యామంత్రి ఇలాకా డిగ్రీ కాలేజీ కూడా లేదు 
*కేసీఆర్ ఫాం హౌస్ కోసం కాళేశ్వరం నీళ్లు
*ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం
*సింహం సింగిల్ గానే వస్తుంది
*వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రసంగం 

మంచోడు...మంచోడు అంటే మంచం కోల్లు ఎత్తుకెళ్లిన కేసీఆర్ అని  పాదయాత్ర చేస్తుంటే ప్రతీ గ్రామంలోనూ ఎన్నో సమస్యలు వినిపిస్తున్నాయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం మహా పాదయాత్ర 5వ రోజు ఆదివారం ఘనంగా కొనసాగింది. ఉదయం 10.50 నిమిషాలకు మహేశ్వరం నియోజకవర్గంలోని నాగారం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా కొత్తతండా, డబీల్ గూడ, మన్సాన్ పల్లి, కొత్వాల్ తండా మహేశ్వరం నియోజకవర్గం వరకు సాగింది. మొత్తం 12.6 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి హామీనిస్తూ శ్రీమతి వైయస్ షర్మిల గారు ముందుకు సాగారు. సాయంత్రం మహేశ్వరం నియోజకవర్గంలో సభ నిర్వహించారు.
విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్దులు, వితంతువులు విలపిస్తుంటే కన్నీళ్లాగడం లేదు. ప్రతీ వర్గం గురించి వైయస్ఆర్ గారు అప్పట్లో ఆలోచన చేశారు. అలా కదా ఒక నాయకుడు ఆలోచించాల్సింది. అది కదా ఒక ముఖ్యమంత్రి పని తనమంటే...మరి ఇప్పుడు ఉన్నాడు ఒక నాయకుడు కేసీఆర్...పాములు ఎరగని పుట్టలు లేవు...కేసీఆర్ మోసం చేయని వర్గం లేదన్నారు. రైతులను, విద్యార్థులను, దళితులను, నిరుద్యోగులను మోసం చేశాడు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తానని మోసం చేశాడు. ఇలా ప్రతీ వర్గాన్ని మోసం చేసిన మోసగాడు కేసీఆర్. మంచోడు...మంచోడు అనుకుంటే మంచం కోల్లు ఎత్తుకు పోయాడట కేసీఆర్ లాంటి వాడన్నారు షర్మిల
.వైయస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశాడు. పేదవారిడి జబ్బొస్తే ఎలా..? అని ఏ నాయకుడు ఆలోచించలేదు. పేదల కోసం ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీని వైయస్ఆర్  అందించాడని గుర్తుచేశారు. తెలంగాణలో ఇప్పుడు చూస్తే అడుగడుగునా సమస్యలు ఉన్నాయన్నారు. 
కేసీఆర్ ఫాం హౌస్ కోసం కాళేశ్వరం నీళ్లు....
తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, కానీ కేసీఆర్ తన ఫాం హౌస్ కోసం కాళేశ్వరం నీళ్లను వాడుతున్నాడని వైయస్ షర్మిల  అన్నారు. నియామకాలు కూడా కేసీఆర్ కుటుంబానికే ఇచ్చుకున్నాడు. ఐదుగురు కుటుంబంలో ఉంటే అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తలకాయ నరికేటోడికే తల్వార్ ఇచ్చినట్టు ఒక కిరాతకున్ని ముఖ్యమంత్రిని చేసుకున్నామన్నారు.  గొర్లు, బర్లు ఇచ్చి నిరుద్యోగులను కేసీఆర్ కాచుకోమంటున్నాడు. ఇదేనా బంగారు తెలంగాణా అంటే అని ప్రశ్నించారు. 
సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారు....
మహేశ్వరం నియోజకవర్గానికి సబితా ఇంద్రారెడ్డి ఏం చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎంత మందికి కట్టించారు. కనీసం ఒక్క డిగ్రీ కళాశాలైనా కట్టించారా అంటూ ప్రశ్నించారు. వర్షం వస్తే నీళ్లు ఇంటిలోకి వచ్చి ప్రజలు బిక్కు...బిక్కు..మంటూ బతుకుతున్నారు. మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఈ ప్రాంతానికి విడుదల చేసిన రూ.90 కోట్లు ఎవరి చేబుల్లోకి పోయాయి. కేసీఆర్ ప్లీనరీ అని నగరంలో ఎక్కడ చూసినా ఆయన మొకారవిందమే కనిపిస్తోందన్నారు.ఐ.టీ.ఐ.ఆర్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటీగ్రేటెడ్ రీజన్ అని, 75 ల‌క్ష‌ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆ హామీలన్నీ ఎక్కడ పోయాయని ప్రశ్నించారు.
పీనుగుల మీద పైసలు ఏరుకునే కేసీఆర్...
పీనుగుల మీద పైసలు ఏరుకునే కేసీఆర్ పాలనలో ఉన్నామని  వైయస్ షర్మిల అన్నారు. ఆడవారి మాన ప్రాణాలకు గండం ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి లిక్కర్ ఒక్కటే ఆదాయమైపోయింది. బీర్లు, బార్ల తెలంగాణాగా మారిపోయింది. అయ్యా, కొడుకులు మాటలు చెప్పే మొనగాల్లే కానీ...పూటకు బత్యం ఇచ్చే పుణ్యాత్ములు కారన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్ల మీదికొచ్చి ధర్నాలు చేస్తే ఎందుకు చేస్తున్నారో అని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మహిళలు పోలీస్ స్టేషన్ లో బలై పోయినా, నడి రోడ్డు మీద లాయర్లను నరికి చంపినా పట్టించుకోలేదని ప్రశ్నించారు. 
నిరుద్యోగుల కోసం ప్రతీ మంగళవారం దీక్ష‌...
పార్టీ పెట్టక ముందు నుంచే నిరుద్యోగుల కోసం మేము ప్రతీ మంగళవారం దీక్ష‌ చేస్తున్నాము. మూడు రోజుల నిరాహారదీక్ష‌ చేస్తామంటే కేసీఆర్ పోలీసులతో దాడి చేయించాడు. ప్రజల సమస్యలు తీర్చడం కోసం ఒక ఆడదాన్ని అయిఉండి పాదయాత్ర చేస్తున్నాను. అధికారంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ కు దమ్ముంటే మాతో పాటూ పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. సమస్యలు ఉంటే కేసీఆర్ రాజీనామా చేయాలని అన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పొత్తు...
మొన్న చిన్న దొర కేటీఆర్ బీజేపీతో మాకు పొత్తుందన్నారు. బీజేపీతో మీకు, మీ అయ్యకు పొత్తుందని అన్నారు. కేసీఆర్, బీజేపీకి సంబంధం ఉంది కనుకనే....కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు, రుజువులు ఉన్నా జైల్లో పెట్టించడం లేదు. నా వీపు నువ్వు గోకు నీ వీపు నేను గోకుతా అని కేసీఆర్, మోడీ ఒకరి కోసం ఒకరు పనిచేస్తున్నారు. బీజేపీ లాంటి మతతత్వ పార్టీలతో, ప్యాకేజీల కోసం అమ్ముడుపోవాలని చూస్తున్న కాంగ్రెస్ తో, టీఆర్ఎస్ తో పొత్తులేదన్నారు. సింహం సింగిల్ గానే వస్తుందని అన్నారు. వైయస్ఆర్ వారసత్వం, విశ్వతనీయత మాకుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై మోడీ, కేసీఆర్ ఒక్కరైనా పన్ను తగ్గించుకుంటే ఇంతలా ధరలు పెరిగేవి కాదని తెలిపారు. వైయస్ఆర్ గారు తన అక్కాచెల్లేల్ల మీద గ్యాస్ ధరలు పడొద్దని ప్రభుత్వమే ఆ రోజుల్లో రూ.50 ధర బరించిందన్నారు. ఇప్పుడున్న నాయకులు ఉంటే ఎంత....ఊడితే ఎంత అన్నారు.
కేసీఆర్ కు కాంగ్రెస్ తో పొత్తుంది...
కేసీఆర్ కు కాంగ్రెస్ తోనూ పొత్తుందని శ్రీమతి వైయస్ షర్మిల గారు అన్నారు. రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉందన్నారు. పట్టపగలే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పట్టు పడినా ఇప్పటికీ అరెస్టు చేయలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తో కేసీఆర్ కు పొత్తుందని, మాకు అలాంటి పొత్తులు అవసరం లేదని, సింహం సింగిల్ గానే వస్తుందన్నారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కేసీఆర్ నాశనం చేశాడు. ప్రపంచ బ్యాంక్ నుంచి కేసీఆర్ ల‌క్ష‌కోట్లు అప్పు తెచ్చాడు. బీడీ బిచ్చమూ...కల్లు ఉద్దరా...అన్నట్టు అన్ని అంత డబ్బు తెచ్చినా ఆరోగ్య శ్రీకి, ఫీజు రియాంబర్స్ మెంట్ కు, రుణమాఫీ చేయడం లేదు. కేసీఆర్ పోవాలి...వైయస్ఆర్ గారి సంక్షేమ‌ పాలన మళ్లీ రావాలని అన్నారు. వైయస్ఆర్ సంక్షేమ‌ పాలన అంటే ఉచిత వైద్యం, స్వంత ఇళ్లు, వ్యవసాయం పండుగ కావడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, అప్పులు లేని బతుకులు జీవించటం అని అన్నారు. ప్రజల కోసమే తెలంగాణ పార్టీ పుట్టిందని అన్నారు. ఒక్క అవకాశం తమకు ఇవ్వాలని కోరారు. మహేశ్వరం గ్రామంలో ఐదో రోజు పాదయాత్ర ముగిసింది.

బైంసాలో అంబేధ్కర్ విగ్రహం ధ్వంసం



బైంసాలో అంబేధ్కర్ విగ్రహం ధ్వంసం
 ఉద్రిక్తత.. 144 సెక్షన్

నిర్మల్ జిల్లా బైంసాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. దీంతో దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో భైంసాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు ఏఎస్పీ కిరణ్ ఖారే. పీడీ యాక్ట్ ప్రయోగించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భైంసా పౌరులు పోలీసులకు సహకరించాలని కోరారు. రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దని, వాట్సప్ గ్రూపుల్లో వీడియోలు షేర్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు . అల్లర్ల నేపథ్యంలో బైంసాలో 144 సెక్షన్ విధించారు పోలీసులు.

ప్లీనరీలో 29 రకాల వంటకాలు సిద్ధం








అమోఘమైన వంటకం పసందైన భోజనం
ప్లీనరీలో 29 రకాల వంటకాలు సిద్ధం

ప్లీనరీకి వచ్చే వారికి భోజన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 29 రకాల వంటలు సిద్ధం చేస్తున్నారు. ఒకే సారి 8 వేల మంది భోజనం చేసేలా 3 డైనింగ్ హాల్స్ సిద్ధం చేశారు. వీవీఐపీలు, ప్రజాప్రతినిధులు, మహిళల కోసం ప్రత్యేకంగా డైనింగ్ హాల్స్ రెడీ చేశారు. తెలంగాణ ప్రత్యేకమైన నాన్ వెజ్, వెజ్ వంటకాలు వడ్డించనున్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫుడ్ కమిటీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, పాయా సూప్, బోటి ఫ్రై, ఎగ్ మసాలా, రుమాలీ రోటీ, ఆలూ క్యాప్సికం, బగారా రైస, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, దాల్ రైస్, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబార్, ఉలవచారు, క్రీమ్, పెరుగు, వంకాయ చట్నీ, జిలేబీ, డబల్ కా మీఠా, ఐస్ క్రీ లాంటి వంటకాలను వడ్డించనున్నారు. ఇందుకోసం 500 మంది వంటవాళ్లను, సహాయకులను నియమించారు.

మాట నిలబెట్టుకునే లీడర్ కేసీఆర్



మాట నిలబెట్టుకునే లీడర్ కేసీఆర్
*ప్రభుత్వాన్ని ఎందుకు కూలగొడ్తవ్ ఈటల?
*పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకా?
*ఈటలకు మంత్రి హరీశ్‌‌రావు ప్రశ్న

ప్రభుత్వాన్ని కూలగొడ్తా అని ఈటల రాజేందర్ అంటున్నడు.. ఎందుకు కూలగొడతవ్? పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకా? రైతు బంధు, కల్యాణలక్ష్మి, దళిత బంధు వంటి పథకాలు పెట్టి ఆదుకుంటున్నందుకా?’’ అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కరీంనగర్‌‌‌‌ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌‌లో జరిగేవి నడుమంత్రపు ఎన్నికలని, రెండేళ్ల నాలుగు నెలల కోసం ఎన్నుకోబోతున్నామని హరీశ్​ చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడని చెప్పారు. కాళేశ్వరం నీళ్ల రాకతో మోటార్లు కాలుడు బాధ తగ్గిందన్నారు. ‘‘మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులకు జీతం బందు పెట్టి మరీ కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు. రైతు రుణ మాఫీ మొదట రూ. 25 వేల వరకు చేసిండు. ఈ మధ్యనే 50 వేల వరకు మాఫీ అయ్యింది. మిత్తితో సహా రూ.లక్ష రుణమాఫీ కోసం వచ్చే బడ్జెట్ లో ఫండ్స్ కేటాయిస్తం. 57 ఏళ్లు నిండిన వారికి రెండు మూడు నెలల్లో పెన్షన్ ఇస్తం. అభయహస్తం కింద మహిళలు కట్టిన పైసలు వడ్డీతో సహా త్వరలో ఇస్తం. ఈ డబ్బులు ఎల్ఐసీ నుంచి తెప్పించినం” అని అన్నారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ.500కు తగ్గిస్తామని చెప్పి ఈటల ఓటు అడగాలని హరీశ్ సవాల్ చేశారు. సిలిండర్ మీద రాష్ట్ర ప్రభుత్వ పన్ను రూ.291గా ఉంటే జమ్మికుంట గాంధీ బొమ్మ కాడ ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని, లేదంటే ఈటల ఇంటికి పోతవా అని ప్రశ్నించారు. 
బీజేపీకి ఓటెందుకు వేయాలో చెప్పండని బండి సంజయ్, కిషన్ రెడ్డికి హరీశ్ లేఖ రాశారు. రైతులు టీఆర్ఎస్‌‌కు ఎందుకు ఓటు వేయాలో తాను వంద కారణాలు చెప్తానని, బీజేపీకి ఎందుకేయాలో ఒక్క కారణం చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. వారికి 15 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ రాశారు.‘‘రైతులను ఉగ్రవాదులతో పోల్చిన పార్టీ బీజేపీ. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే పాకిస్తాన్ అని ముద్ర వేయడం, రైతుల గురించి మాట్లాడితే ఖలిస్తాన్ అని ముద్ర వేయడం, న్యాయం గురించి మట్లాడితే హిందుస్తాన్ అని అరవడం బీజేపీ నాయకుల దుర్నీతి” అని మండిపడ్డారు. 
అక్టోబర్ 30 తర్వాత కూడా రాష్ట్రానికి కేసీఆరే సీఎంగా ఉంటారని.. ప్రజలు, కేసీఆర్ ఆశీర్వాదంతో తాను మంత్రిగానే ఉంటానని హరీశ్​రావు అన్నారు. ఈటల గెలిచేది లేదు.. మంత్రి అయ్యేది లేదన్నారు. ఈటల తన స్వార్థం కోసమే బీజేపీలోకి వెళ్లాడని, ప్రజలందరికీ లాభం జరగాలంటే గెల్లు శ్రీనివాస్‌‌ గెలవాలన్నారు. 30న గ్యాస్​కు దండం పెట్టి, బీజేపీని బొందపెట్టి, కారు గుర్తుకు ఓటు కొట్టాలన్నారు. బొందపెడతా, కూలగొడతా, అంతు చూస్తా, గోరీకడతా అనడం తప్ప ప్రజలకు పనికొచ్చే మాట ఒక్కటీ కూడా ఈటల చెప్పట్లేదన్నారు. ‘‘బాయిల కాడ మీటర్లు పెడ్తరట. మార్కెట్లు పీకేస్తరట. దొడ్డు వడ్లు కొనరట. మరి బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి” అని ప్రశ్నించారు. రాజేందర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ‘ఎకరం భూమి అమ్ముతా.. ఎన్నికల్లో గెలుస్తా’ అని ఆయన అనడమే ఇందుకు నిదర్శనమన్నారు. జూటా పార్టీలో చేరిన ఈటలకు ఆ నీళ్లు బాగా వంటపట్టాయని, అన్నీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు మంత్రి హరీశ్ రావు.

22, అక్టోబర్ 2021, శుక్రవారం

నా బతుకంతా తెలంగాణ ప్రజలకే అంకితం చేస్తా.-వైయస్ షర్మిల



నీటి కన్నా మద్యం ఏరులై పారుతోంది::
ఇంగ్లీషు మీడియంకు దిక్కు లేదు గాని ఇంగ్లీషు మందు మాత్రం దొరుకుతోంది::
ప్రజలకేమో గొర్లు, బర్లు.. కేసీఆర్ కుటుంబానికేమో పదవులా?::
ప్రజలు ఆదరిస్తే వైయస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తా::
ప్రజా ప్రస్థానంలో శ్రీమతి వైయస్ షర్మిల::
రెండో రోజు 12.9 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర::

YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారి ప్రజా ప్రస్థానం రెండో రోజూ అదే జోరుతో కొనసాగింది. ఉదయం 9.30గంటలకు నక్కలపల్లి గ్రామంలో మొదలైన మహా పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వృద్ధులు, మహిళలు, రైతులు, కార్మికులను ఆప్యాయంగా పలకరిస్తూ వైయస్ షర్మిల గారు ముందుకు సాగారు. మహిళలు, వృద్ధులు తమ బాధలు చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు ఇచ్చారు.  నక్కలపల్లి నుంచి కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్, కవ్వడిగూడ, మల్కాపురం గ్రామాల మీదుగా ఈ పాదయాత్ర సాగింది. రెండో రోజు మొత్తం 12.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.

షర్మిల గారికి సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజలు::

మల్కాపురంలో నిర్వహించిన మాట–ముచ్చట కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కేసీఆర్ పాలనలో తమ బతుకులు బుగ్గిపాలు అయ్యాయని కంటతడి పెట్టారు. ఇండ్లు లేక గుడిసెల్లోనే ఎండకు ఎండుతూ, వానకు నానుతున్నామని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానలకు ఇండ్లు కూలిపోయినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదన్నారు. భర్త చనిపోయి రెండేండ్లు అవుతున్నా పింఛన్లు రావడం లేదన్నారు. ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేదన్నారు. ఆఫీసర్లు ఏ పనికైనా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అర్ధ ఎకరం భూమి ఉన్నా రేషన్ కార్డు తొలగించారని తెలిపారు. ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకున్నారే తప్ప ఇండ్లు, పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. ఆసుపత్రులకు వెళితే ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారని, ప్రైవేటు హాస్పిటళ్లు లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయని పేర్కొన్నారు. ధరణి వెబ్ సైట్ తీసుకొచ్చినా భూముల పంచాయితీలు తెగలేదన్నారు. సర్పంచులకు తమ బాధలు చెబితే పట్టించుకోవడం లేదన్నారు. గ్యాస్, కరెంట్ బిల్లు పెరిగి భారంగా మారాయని ఆవేదన చెందారు.  ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, ఎక్కడా పని దొరకడం లేదన్నారు.

అనంతరం వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ...
‘‘ మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి నాయకుడు వైయస్ఆర్ గారు. ఐదేండ్లలో ఒక్క పన్ను పెంచకుండా అద్భుతమైన పాలన సాగించారు. రైతులకు రుణమాఫీ చేశారు. పేదింటి బిడ్డలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చి, ఉన్నత చదువులు చదించారు. వైయస్ఆర్ గారు పేదల గురించి మాత్రమే ఆలోచించి సంక్షేమ పథకాలు అమలు చేశారు. 108, 104 సేవల ద్వారా ఉచిత వైద్యం అందించారు. ఐడేండ్లలో మూడు సార్లు నోటిఫికేషన్లు వేసి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రైవేటు రంగంలోనూ లక్షలాది ఉద్యోగాలు కల్పించారు. వైయస్ఆర్ పాలనలో నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు పెరగలేదు. ప్రాణహిత చేవెళ్ల ద్వారా రంగారెడ్డి జిల్లాకు రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడున్న కేసీఆర్ మాత్రం మోసపూరిత హామీలు ఇస్తూ ప్రజలను దగా చేస్తున్నారు. జిల్లాకు కృష్ణా నీళ్లు తెస్తామని చెప్పి మోసం చేశారు. రైతులు ఏ పంట వేయాలో కేసీఆరే డిసైడ్ చేస్తుండు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదు. కేవలం 3లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి, 36లక్షల మందికి ఎగ్గొట్టాడు. కేసీఆర్ ఒక్క మాటా నిలబెట్టుకోలేదు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్నడు. మూడెకరాలు భూమి ఇస్తానన్నడు.. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానన్నడు. ఇలా అందరి చెవుల్లో పూలు పెట్టాడు. రాష్ట్రంలో ఇంగ్లీషు చదువులు లేవు కాని ఇంగ్లీషు మందు మాత్రం దొరుకుతోంది. కేసీఆర్ ను నమ్మి, ముఖ్యమంత్రిని చేస్తే బంగారు తెలంగాణ పేరుతో బారుల తెలంగాణ, బీరుల తెలంగాణ చేశాడు. వైయస్ఆర్ ఉన్నపుడు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. కేసీఆర్ మాత్రం మహిళలకు కనీసం రుణాలు కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్ పాలనలో పిల్లలు చదువుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే  3,500 స్కూళ్లు బంద్ చేయించాడు. 14 వేల మంది టీచర్లను తొలగించాడు. కష్టం మనది.. దోచుకోవడం కేసీఆర్ కుటుంబానిది. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి కాచుకోమంటున్నాడు. వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. దున్నపోతు మీద వాన పడ్డట్టుగా కేసీఆర్ లో మాత్రం చలనం లేదు. చస్తే చచ్చారులే.. ఉద్యోగాలు అడిగేవారు ఉండరని కేసీఆర్ అనుకుంటున్నాడు. తెలంగాణలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మారాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజా సమస్యలను ఎత్తిచూపడానికే మేం పాదయాత్ర చేపడుతున్నాం. ప్రభుత్వం మెడలు వంచేందుకే మా పోరాటం. ఈ రెండేండ్లలో కేసీఆర్ దిగి వచ్చి, ప్రజలకు క్షమాపణ చెప్పి, సమస్యలు పరిష్కరించాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు గట్టి బుద్ధి చెప్పాలి. ప్రజలు YSR తెలంగాణ పార్టీని ఆశీర్వదిస్తే వైయస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తానని, వైయస్ఆర్ బిడ్డగా మీకు మాట ఇస్తున్నాను. నా బతుకంతా తెలంగాణ ప్రజలకే అంకితం చేస్తా.

*చేవెళ్ల నియోజకవర్గం లో ప్రజా ప్రస్థానం యాత్ర రెండో రోజు ముగించుకొని, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోకి ప్రవేశించారు. 

13, అక్టోబర్ 2021, బుధవారం

హుజూర్ "బార్" మే కిక్కే కిక్కు



మందుబంధు మత్తుకే మద్దతు
మందుకొట్టినోళ్లు మాటతప్పరు
బాటమీద తడబడిన మీటపైనే ద్యాస
ముప్పైలో మందెవరిస్తే వాళ్లకే వారి ఓటు

మరి కొద్ది రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. సర్వేలు తేడాగా వస్తున్నాయి.. గెలిచే ఛాన్సులు తక్కువనే ... ఏం చేసినా ఫలితం శూన్యమే.. వందల కోట్ల రూపాయలు ఆశపెట్టిన అంత ఎఫెక్ట్ లేదు. కొత్త కొత్త పథకాల హామీలు అవసరమే లేదు. అభ్యర్థుల గ్రాఫ్.. డౌన్ అవుతుందే గానీ పెరగడం లేదు. ఏం చేయాలా అంటే..అన్నిటికి ఒకటే మార్గం.. "మందు బంధు" . ఎన్నికల బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తున్నారు..అయితే ఇన్నాళ్లు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మరో ఎత్తు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారంలో గెలుపు కోసం చేయని ప్రయత్నాలు లేవు.. ఏదైనా చేసి సరే తాము గెలువాలనే తపనతోనే తహతహ లాడుతున్నారు.. అందుకే అధికారపార్టీ అయినా  మరో పరోక్ష పార్టీ అయినా తమ ఓటర్లను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా హుజూర్ బార్ తెరిచినట్లున్నారు.. నియోజకవర్గంలోని ప్రతి మండలం కేంద్రం, గ్రామ గ్రామంలో పలుకరించడానికి వెళ్తే మందుకొట్టినోడు..మాట మీద నిలబడతాడు... మందు కొట్టినోడు బాటమీద తడబడతాడు అన్నట్లుగానే నియోజకవర్గంలో మందుబాబుల అవతారం దర్శనమిస్తుంది.. వారికి ఎటు నుంచి వస్తుందో వారికే తెలుసు..
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి అక్రమంగా మద్యం డంప్ అవుతోంది. ఎక్కడ చూసిన రాయల్ స్టాగ్ మందు సీసాలే దర్శనమిస్తున్నాయి. గ్రామశివారుల్లో నలుగురు కనబడ్డారంటే.. వారిదగ్గర కచ్చితంగా ఫుల్ బాటిల్ ఉంటుంది.. మంచి నీళ్లు దొరకడం కష్టమేమో కానీ హుజూర్ బార్ లో ఏకాంతం ప్రదేశాల్లో కనబడే వారి దగ్గరకు వెళ్లి అడిగితే మందు మాత్రం దొరుకుతుంది.. అంటే అర్ధం చేసుకోవచ్చు.. పక్క నియోజకవర్గాల్లోని మందుబాబులు మదనపడుతున్నారంటా... మా కూడా ఇలా ఎన్నికలొస్తే బాగుండేదేమో.. మత్తుగా గమ్మత్తుగా కొన్ని రోజులు గడిచేదని..కొందరు పొరుగు నియోజకవర్గాల మందుబాబులు వచ్చిన అవకాశం ఎందుకు పోనియాలే అన్నట్లుగా అభ్యర్థుల ప్రచారకర్తల అవతారమెత్తి.. హుజూర్ బార్ లో నే తిష్ట వేశారంటే... అవగాహన చేసుకోవచ్చు...బాక్సులకు బాక్సులు హుజూరాబాద్ చేర్చడంలో  కీలకపాత్ర పోషిస్తున్నారు కొందరు బడాబాబులు..హుజూరాబాద్ లో ఎక్కడ చూసినా రాయల్ స్టాగ్ మద్యమే కనిపిస్తోంది. నియోజకవర్గ ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తున్నారు ముప్పై మందిలోని కొందరు అభ్యర్థులెవరో... ఊరూరా వ్యాన్ లో తరలిస్తూ ఎన్నిక నాటికి ప్రజల చేత బాగా తాగించి ఓట్లు దండుకోవాలనే  ప్రయత్నమే సాఫీగా సాగుతోంది. ఎవరి పోరాటం వారిదే అన్నట్లుగా ప్రతిపక్షాలు, పోలీసులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటం పై తాగుబోతులుగా మారుతున్న వారి కుటుంబీకులు  మండిపడుతున్నారు..
ప్రధానంగా ఈ ఎన్నికలో అధికారులు కూడా పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నట్లుగా ఉంది.. ఎన్నికల నిబంధనలు మద్యం అమ్మకాలు అనేవి నామమాత్రంగానే ఉన్నాయి... ఎవరికి ఎంత దమ్ము ఉంటే అంతా... అని ఎవరు ఎక్కువ కష్టపడితే వారిదే గెలుపు అని.. అది మందుబంధు పథకం తోనే సాధ్యం అని భావిస్తున్నట్లుగా ఉంది... అందుకే అధికార యంత్రాంగం సైతం మందుబంధు పథకానికి మద్దతిచ్చిందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న కొద్ది మందుబాబుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంటే.. అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. చివరగా పొలింగ్ రోజున బూత్ పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహిస్తేనే వణుకుపుట్టేస్తుంది... పార్టీలు పూర్తిగా 100శాతం ఓటర్లను మందుకు బానిసలుగా మార్చితేనే తమ గెలుపు సాధ్యమనుకుంటున్నాయా...? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి తాజా పరిస్థితులను పరిశీలిస్తే.. ఇప్పటికైనా ఈ ఎన్నికలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్య ఎన్నికల విధానాన్ని కాపాడాల్సిందిగా పలువురు సామాజిక వేత్తలు కోరుతున్నారు.. ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా ఈ మందు బంధు పథకంపై చర్యలు తీసుకోవాల్సిందిగా  కోరుతున్నారు.. చూడాలి.... మరీ... ఎంతవరకు చర్యలు తీసుకోగలుగుతారో....

వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్