భయం గుప్పిట్లో హుజూరాబాద్
దళితబంధు కావాలంటే కేసీఆర్ జెండా పట్టుకోవాలట
18 ఏళ్లు కష్టపడితే నీవు ఇచ్చిన గిఫ్టు ఇదా?
కమలాపూర్ లో కేసీఆర్ పై ఈటల గర్జన
హనుమకొండ, ప్రజాజ్వాల:
సీఎం కేసీఆర్ పై మరోసారి గర్జించారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్. నాలుగు నెలలుగా హుజురాబాద్ లోని ఊళ్లకు ఊళ్లు భయం గుప్పిట్లో గడుపుతున్నారని ఆరోపించారు. కమలాపూర్ మండలం భీంపెల్లిలో వివేక్ వెంకటస్వామితో కలిసి.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేసీఆర్ పై మండిపడ్డారు. దళితబంధు కావాలంటే కేసీఆర్ జెండాలు పెట్టుకోవాలట,ఫించన్ రావాలంటే గులాబీ కండువా వేసుకోవాలట. రైతు బంధు కావాలంటే వాళ్లకే ఓటు వేయాలట
ఈ డబ్బులన్నీ నీ జాగీరు కాదు బిడ్డా.. ఈ డబ్బు మా ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చాయని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కు అధికారం కట్టబెట్టింది.. కేవలం కాపాలదారుగా ఉండమని మాత్రమే. ఆయన ఓనర్ కాదన్నారు. ఈ డబ్బుకు మనమే ఓనర్లం.. కాపాడాల్సింది కేసీఆర్. కాపాడమని ఇస్తే.. మనమీదనే పెత్తనం చేస్తుండు. ఇటెటు రమ్మంటే ఇల్లంతా నాదే అంటున్నాడు. అని విమర్శలు చేశారు.
కళ్లులేని ఓ కబోదుల్లారా రండి.. మా దగ్గర జరిగిన అభివృద్ధి చూపిస్తా అని, నేను కట్టిన బ్రిడ్జిలు, చెక్ డ్యాంలు చూడండి అని, నేను రాకముందు వానలు వస్తే ఊర్లు దాటి బయటకు వచ్చే పరిస్థితులు ఉండేవి కాదన్నారు. వాళ్లు ఎంతగా అబద్ధాలు ఆడుతున్నారో హుజురాబాద్ ప్రజలకు అర్థమైందన్నారు. రాత్రి 11 గంటలకు, 12 గంటలకు మంత్రులు.. డీసీఎంలలో లిక్కర్, మాంసం తీసుకువచ్చి ఊర్లన్నింటినీ బార్లుగా మార్చారన్నారు. ఇప్పుడు దావతులిచ్చి గ్రామాల్లో పిల్లలను తాగుబోతులను చేస్తున్నారు. తాగి ప్రమాదాల భారిన పడుతున్నారు. ఊర్లలో గొడవలవుతున్నాయి. వచ్చినవాళ్లంతా ఊర్లలో చిచ్చుపెట్టేందుకు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టి 20 ఏళ్లైతే.. నేను ఆ పార్టీలో 18న్నర ఏళ్లు ఉన్నానని, నేను మధ్యలో వచ్చి మధ్యలో పోయానంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేను గడ్డిపోచనని పీకేస్తో పోతాననుకున్నాడు ముఖ్యమంత్రి అని, తానిచ్చిన బీఫారంపై, కారుగుర్తుపై గెలిచానని.. నన్ను విసిరేసాడని , అక్కరకొచ్చినన్ని రోజులు నన్ను వాడుకుని విసిరేసారని ఆవేదన చెందారు. ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినంక బోడమల్లన్నలాగా చేసారన్నారు. 2019లో ఇక్కడి కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఓడిపోయిన వినోద్ కుమార్ కు హుజురాబాద్ లో మాత్రం 54 వేల మెజార్టీ ఇచ్చామన్నారు. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి.. రాజీనామా చేయమని నాకు సవాల్ విసిరారు. ఇజ్జత్ లేని దగ్గర ఉండకూడదని.. నా ఆత్మగౌరవం కంటే పదవి పెద్దది కాదని రాజీనామా చేసి మీ ముందుకు వచ్చానన్నారు. నాకు 200 ఎకరాలు ఉందని ఒకడంటండు.. ఇంకొకడు 7 వేల ఎకరాలు అంటున్నడు. ఏది నిజమో చెప్పాలన్నారు. రెండు గుంటలున్నోడితే పోటీ అంటున్నారు. మరి రెండు గుంటలమ్మితే లక్ష రూపాయలు మాత్రమే వస్తాయి. ఇప్పటికే 2 గుంటల కలిగినోడు.. 250 కోట్లు ఎలా ఖర్చు చేసాడని ప్రశ్నిస్తున్నారు.. ఎన్నివందల కోట్లైనా ఖర్చుచేయండి, ఎన్ని దొంగనోట్లైనా నమోదు చేయండి.. ఏమైనా చేయండి.. ఈటల రాజేందర్ ముఖం మాత్రం అసెంబ్లీలో కనిపించకూడదని కేసీఆర్ హుకుం జారీ చేసాడని తెలిపారు.ఆ పని జరుగుతుందా..? పార్టీ నీదే కావచ్చు.. కానీ ఓట్లు మా ప్రజలవి అన్నారు.
నీ పదవి పుట్టిందే మా తెలంగాణ ప్రజల ఓట్లకు అని మరిచిపోవద్దన్నారు ఈటల. నా పదవి కూడా నాకు ప్రజలు పెట్టిన బిక్షగా భావించాను. కానీ నీవు కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నావన్నారు. ఇక్కడున్న ప్రజలు గొర్రెలు కాదు.. చైతన్యవంతమైన ప్రజలు ఇక్కడున్నారు. ఈ మట్టిలో ఉన్నది చైతన్యం, పౌరుషం... మా బిడ్డలను డబ్బుతో కొనాలని చూస్తే ఖబర్ధార్. ఢిల్లీకి వెళ్లి పండగులున్నాయని, కరోనా ఉందని ఎన్నికలు పెట్టొద్దని అడుగుతున్నాడన్నారు. నీకు దమ్ముంటే ఎన్నికలు పెట్టి ధర్మంగా కొట్లాడు... నీకు డిపాజిట్ కూడా రాదన్నారు. నీవు కాదు కదా.. నీ జేజమ్మ వచ్చినా నీకు డిపాజిట్ రాదన్నారు. ఇది మాది.. 90 శాతం ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నావెంటే ఉన్నారు. నాలుగు నెలల 25 రోజులుగా కొట్లాడుతున్నా.. నా దగ్గర పైసలు అయిపోయినయి అనుకుంటున్నరట. మీ ప్రేమ ఉన్నాక.. నాకు డబ్బులెందుకు ఖర్చవుతాయి.నిజంగా నాకు డబ్బులే అవసరముంటే.. 18 ఏళ్లుగా ప్రజలకోసం పనిచేసిన నేను పిలుపునిస్తే ఇంటికి వెయ్యో, రెండువేలో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈసారి ఖర్చు కూడా తక్కువేనని నా భార్య చెబుతోంది అన్నారు
నా భార్య సంపాదిస్తేనే తెలంగాణ ఉద్యమం నడిచింది.. నా భార్య సంపాదిస్తేనే నీ వాహనాల్లోకి డీజిల్ వచ్చింది. 18 ఏళ్లు కష్టపడితే నీవు ఇచ్చిన గిఫ్టు ఇదా? నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి.. తెలంగాణ సమాజంలో నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసాడు. ఒక్క ఎకరం ఆక్రమించుకున్నా ముక్కు నేలకు రాస్తానని నా భార్య సవాల్ చేసింది. లేకుంటే కేసీఆర్ ముక్కుకు నేలకు రాస్తాడా అని అడిగింది. నాభార్య, కొడుకు ఇప్పటికీ సద్ది కట్టుకుని వెళ్లి కష్టపడుతారు. నీ ఇంట్లో ఎవరు పనిచేస్తారు? ఇంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది. నీ భూములమ్మావా? కూలిపని చేసావా..? ఇక్కడ ఖర్చు చేసే 200 కోట్లు ఎట్లా వచ్చాయి. హుజురాబాద్ లో దళితబంధు పేరుతో మోసం చేస్తే చాలనుకున్నావు.. కానీ ఇది పామై నీ మెడకు చుట్టుకుంటుంది. నా సభకు డప్పులు కొట్టడానికి వచ్చిన వారికి దళితబంధు రాదని బెదిరిస్తే వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 2 గంటలు డప్పులు కొట్టేందుకు రాకుండా దూరముండి.. మళ్లీ మా రాజేందర్ కోసమని వచ్చారు. డప్పు కొట్టాలన్నా వాళ్ల పర్మిషన్ కావాలట. ఏడున్నరేళ్లలో దళిత సమాజానికి ఒక్క స్కీం అయినా ఇచ్చాడా? మనం దేవునిలా భావించే అంబేద్కర్ జయంతికి, వర్ధంతికి ఒక్కనాడైనా దండవేసాడా? హుజురాబాద్ ఎన్నికలొచ్చాక.. ఇప్పుడు దండలేస్తున్నాడు. జై భీం, జై అంబేద్కర్ అంటున్నాడని వివరించారు.
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-9358413606572061" crossorigin="anonymous"></script> <ins class="adsbygoogle" style="display:block" data-ad-format="fluid" data-ad-layout-key="-ft-q-57-df+1gc" data-ad-client="ca-pub-9358413606572061" data-ad-slot="1239354153"></ins> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({}); </script>
నీకు దళితులపై ఉన్న ప్రేమ నిజమే అయితే.. దళితబంధు సొమ్ముపై కలెక్టర్, బ్యాంకు అధికారుల పెత్తనం తీసేయాలి. దళితబంధు సొమ్మును స్వేచ్ఛగా ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వాలి. తెలంగాణలోని దళితుల కుటుంబాలన్నింటికి హుజురాబాద్ ఎన్నికల్లోపు డబ్బులు ఇవ్వాలి. ఎన్నికల్లోపు డబ్బులు రాకపోతే.. ఎగనామం పెట్టడం ఖాయం. ఎగనామం పెట్టడం కేసీఆర్ కు చాలా సులువు. కేసీఆర్ దగ్గర డబ్బుల్లేవు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు నాలుగేళ్లుగా ఇవ్వలేదు. కానీ కేవలం హుజురాబాద్ లో మాత్రం ఓట్ల కోసం మొన్న ఇచ్చారు. మిగతా చోట్ల ఇప్పటికీ ఇవ్వలేదు. సర్పంచుల్లారా, ఎంపీటీసీల్లారా.. మీకు బిల్లులు రిలీజ్ అయ్యాయంటే నావల్లే. యాదవులకు గొర్రెలు వచ్చింది కూడా నావల్లే. నాలుగేళ్ల కిందటే డీడీలు కట్టినా ఇన్నేళ్లు ఇవ్వలేదు. కేసీఆర్ మీకు పథకాలతోపాటు.. నన్ను పొడవమని ఓ కత్తి కూడా ఇస్తున్నాడు. గడ్డిపోచనుకున్న ఈటల గడ్డపారలాగా ఉన్నాడని..ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడుతాడని కేసీఆర్ భయపడుతున్నడు. నీచమైన కుట్రతోనే నా గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కుట్రలో మీరు భాగస్వాములు కావద్దు. తెలంగాణకు వేగుచుక్క హుజురాబాద్ కాబోతోంది. ఆ బాధ్యత తీసుకుని మీరు ధర్మాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి