వార్తలు విశ్లేషణలు

27, సెప్టెంబర్ 2021, సోమవారం

భారీ వర్షంలో సంపూర్ణంగా భారత్ బంద్

భారీ వర్షంలో భారత్ బంద్ సక్సెస్
*అఖిలపక్షాల భార‌త్ బంద్ విజయవంతం
*కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేనా?
*విపక్షాల డిమాండ్లపై ప్రభుత్వ వైఖరేంటీ?
*తెలంగాణలో రోడ్డెక్కిన అఖిల పక్షాలు
*అక్రమ అరెస్టులని విపక్షాల ఆందోళనలు
*

భారీ వర్షంలో సంపూర్ణంగా భారత్ బంద్ 
హైదరాబాద్, ప్రజాజ్వాల:
భారత్ బంద్ తో దేశ‌రాజ‌ధాని ఢిల్లీ ట్రాఫిక్ మయమైంది. సెంట్ర‌ల్ ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ రూట్స్ అన్ని వేలాది వాహనాల‌తో క‌నిపించాయి. రాజ‌ధానిలోకి రైతులు ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌న్న నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌ల‌తో పోలీసులు ప్ర‌తి వాహనాన్ని త‌నిఖీ చేశాకే అనుమ‌తించారు. కేంద్రం తెచ్చిన మూడు కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను నిర‌సిస్తూ 40రైతు సంఘాలు క‌లిసి ఏర్ప‌డ్డ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన భార‌త్ బంద్ సంపూర్ణంగా సక్సెస్ అయ్యిందని చెప్పుకోవాలి. ఓ వైపు భారీ వర్షాలు..మరో వైపు విపక్షాల నిరసన ర్యాలీలతో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు తెలిపినట్లయింది..  రైతు సంఘాల‌కు మ‌ద్ధ‌తుగా దేశంలో ప్ర‌తిచోట బంద్ ప్ర‌భావం క‌నిపించింది. ప్ర‌తిప‌క్ష పార్టీ ప్ర‌భుత్వాలున్న చోట బంద్ సంపూర్ణం అయినప్పటికి, ఇత‌ర చోట్లలో  అఖిల‌ప‌క్ష కూట‌ములు బంద్ ను విజ‌య‌వంతం చేశాయి.

భారత్ బంద్ కు కాంగ్రెస్, లెఫ్ట్, బీఎస్పీ, ఎస్పీ, ఆప్, వైసీపీ, టీడీపీ, డీఎంకే స‌హా మొత్తం 20పార్టీలు మ‌ద్ద‌తిచ్చాయి. ఏపీలో అధికార‌, విప‌క్ష పార్టీలు మ‌ద్ద‌తుకు సంపూర్ణ మ‌ద్ద‌తివ్వ‌టంతో బంద్ ఆందోళలనకు ఆస్కారం లేకుండాపోయింది. ప్రభుత్వమే బంద్ ను ప్రకటించినట్లవడంతో అక్కడ ప్రభావం కనడలేదు.. ఎక్క‌డి బ‌స్సులు అక్క‌డే నిలిచిపోయాయి. లారీల చ‌క్రాలు క‌ద‌ల్లేదు. ప్రైవేటు వాహ‌నాలు కాస్త క‌నిపించినా ఎలాంటి వ్యాపార స‌ముదాయాలు తెరుచుకోక‌పోవ‌టంతో బంద్ విజ‌య‌వంతమైనట్లు ప్రకటించుకున్నారు. దీంతో కేంద్రం కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఆయా పార్టీలు కోరుతున్నాయి..
తెలంగాణ‌లో భారత్  బంద్ ప్రభావం ఘాటుగానే కనిపించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా ఇక్కడ అఖిల పక్షాలు తలపెట్టిన బంద్ విజయవంతమైందని చెప్పుకోవచ్చు.  అధికార టీఆర్ఎస్ దూరంగా ఉన్న‌ప్ప‌టికీ బంద్ ను విపక్షాలు విజ‌య‌వంతం చేశాయి. ఉద‌యం నాలుగు గంట‌ల నుండి ఆర్టీసీ డిపోల ఎదుట అఖిల‌ప‌క్ష నేత‌లు బైఠాయించారు. రైతుల‌కు మ‌ర‌ణ‌శాస‌నంగా మారిన న‌ల్ల చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని కోరారు. ఉప్ప‌ల్ డిపో వ‌ద్ద పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీపీఎం నేత త‌మ్మినేని వీర‌భ‌ద్రం బంద్ లో పాల్గొన‌గా… పోలీసులు అరెస్ట్ చేసి వ‌దిలిపెట్టారు. బంద్ లో భాగంగా గుర్ర‌పు బండిపై అసెంబ్లీకి వెళ్తున్న సీఎల్పీ నేత భ‌ట్టి, సీతక్క తో పాటు ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు ముందు అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో అఖిల‌ప‌క్ష నేత‌ల అరెస్టు కొన‌సాగాయి. అఖిల‌ప‌క్ష నేత‌ల ఆందోళ‌న‌తో మ‌ధ్యాహ్నం వ‌ర‌కు పాక్షికంగా ఆర్టీసీ బ‌స్సులు తిర‌గ్గా… సాయంత్రానికి య‌ధావిధిగా న‌డిచాయి. ఓవైపు భారీ వ‌ర్షంలోనూ అఖిల‌ప‌క్షం ఐక్యంగా బంద్ ను విజ‌య‌వంతం చేయడానికి ప్రయత్నించాయి.
మొదటిసారి భార‌త్ బంద్ లో మంత్రి కేటీఆర్ స్వ‌యంగా పాల్గొని న‌ల్ల చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరార‌ని…. మ‌రి ఇప్పుడెందుకు దూరంగా ఉన్నార‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. కేసీఆర్ మోడీవైపు వెళ్లిపోయార‌ని, ఇక్క‌డ రైతులు, జ‌నం అంతా బంద్ లో ఉంటే… కేసీఆర్ మాత్రం ఢిల్లీలో బీజేపీ నేత‌ల‌తో విందులో ఉన్నార‌ని మండిప‌డ్డారు. అంబానీ, అదానీల‌కు దేశాన్ని దోచిపెట్టేందుకే ఈ న‌ల్ల చ‌ట్టాల‌ని, న‌ల్ల‌చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసే వ‌ర‌కు కాంగ్రెస్ రైతుల‌కు అండ‌గా ఉంటుంద‌ని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్