*అప్పు చేస్తే ఆత్మహత్యే పరిష్కారమా?
*అన్నదాతకు ఆర్ధిక ఇబ్బందులెందుకు?
*అప్పు చేసి అందరికి ఉపాదికల్పించినందుకా?
*అప్పు చేసి నష్టాన్ని భరించినందుకా?
*అప్పు చేసి ప్రపంచానికి అన్నం పెట్టినందుకా?
*చేసిన అప్పుతో విలాసవంత జీవితం గడపనందుకా?
*చేసిన అప్పు పెట్టుబడికి పెట్టి దిగుబడి రాకపోతే తప్పా?
*ప్రకృతి ప్రకోపానికి నష్టపోతే రైతే బాధ్యుడా?
*అప్పులిచ్చే వారు అధిక వడ్డీలు వసూలు చేసి దర్జాగా ఉంటారా?
*అప్పులు చేసి కార్మికులకు పని కల్పించిన రైతు చావాలా?
*అన్నపూర్ణం దేశంలో అన్నదాత ఆత్మహత్యలెందుకు?
============================
అన్నపూర్ణ దేశం భారత దేశం.. ప్రపంచానికి ధాన్యాగారం నా భారతం.. అలాంటి భారత దేశానికి వెన్నెముక అన్నదాత... వ్యవసాయం చేసే ఓ సామాన్య శ్రామికుడు రైతు.. నేడు రైతు ఆత్మఘోష ఘోషిస్తుంది. తాతల నాటి భూమిని సాగు చేస్తూ అందరికి అన్నం పెట్టే రైతు గుండే నేడు ఆగిపోతుంది. రాజుల కాలం నుంచి రైతాంగంపైనే అందరి జీవితాలు కొనసాగాయి. అప్పటి నుంచి రైతులను హింసించి, బెదిరించి శిస్తుల పేర్లతో నయవంచన చేసి వారి కష్టాన్ని దోచుకునే వాళ్లని చరిత్రలో కథనాలున్నాయి.. తరతరాలుగా కష్టం చేసి అందరికి అన్నంపెట్టే అమాయక జీవి అరాచకాలకు బానిసైపోతూనే ఉన్నాడు.. స్వరాజ్యంలోనూ ఏనాడు రైతుకు ఇన్ని కష్టాలు రాలేదు.. కానీ నేడు రైతే రాజు అనే మాట ... రైతే ధౌర్భాగ్యుడనేలా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎంతో మంది రైతులు బలయ్యారు. ఇప్పటి వరకు బలైన రైతుల విషయాల్లో ఏవో కొన్ని మాత్రం ఇతర కారణాలతో ఆత్మహత్యలైతే... అత్యధికంగా రైతులు ఆర్ధిక ఇబ్బందులు, అప్పుల బాధలతోనే చనిపోతున్నారనేది వాస్తవం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతే రాజు అని.. రైతుబంధు లాంటి మహోత్తమ పథకాలను అమలు చేస్తున్నా... రైతు బీమా లాంటి పథకాలు.. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలతో రైతులకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నా... రైతు ఆత్మహత్యలు మాత్రం కలవరపెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో చోట ఓ రైతు కుటుంబం రోడ్డున పడుతుంది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సహకారం గొప్పగా ఉన్నా... అసలు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారనే దానిపై పాలనా యంత్రాంగం ఎందుకు చర్చించడంలేదో తెలియదు..
పంట రుణాలు ఇచ్చిన బ్యాంకులు వడ్డీలు తీసుకుని బాగానే ఉంటాయి.. వడ్డీకి ఇచ్చిన ప్రైవేటు కంపెనీలు బాగానే ఉంటాయి. అప్పు చేసి పెట్టుబడి పెట్టి ప్రకృతి ప్రకోపానికి నష్టపోయిన రైతు మాత్రం ఆత్మహత్య చేసుకోవడం దారుణమైన పరిస్థితి.. చాలా మంది రైతులు చేసిన అప్పులతో వారి వ్యవసాయ క్షేత్రాల్లో పెట్టుబడికి మాత్రమే వినియోగిస్తున్నారనేది అందరికి తెలిసిన విషయమే.. ఓ హెక్టారు భూమి ఉన్న రైతు ఓ పంట వేయడానికి పెట్టుబడి నిమిత్తం తెచ్చిన అప్పును ఖర్చు చేస్తాడు.. అతన వ్యవసాయం చేయడం వలన ఎంతో మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి లభిస్తుంది. ఎంతో మంది యంత్ర పరికరాలున్న వారికి పని దొరుకుతుంది. విత్తన కంపెనీలకు విత్తనాలు అమ్ముడు పోతాయి. పురుగు మందుల కంపెనీల మందులు అమ్ముడుపోతాయి. ప్రభుత్వానికి రావాల్సిన పన్ను వస్తుంది.. ఇన్ని చేసినా ఆఖరికి నోటికాడికి వచ్చిన పంట అకాల వర్షంతోనో... ప్రకృతి వైపరిత్యంతోనో దిగుబడి రాకపోతే... ఆ రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా...
కొత్తగా రైతు చట్టాలు చేసినా... వాటిని రద్దు చేసినా పెద్ద ప్రతిఫలం లేదు.. రైతు పెట్టుబడికి పెడుతున్న అప్పుల పై ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.. రైతుబంధుతో రైతు కష్టాలు తీరుతున్నాయా? ఆలోచన చేయాలి.. రైతు బీమాతో రైతుకుటుంబాల బాధ తీరుతుందా.. ? ఎందుకీ పరిస్థితి నెలకొంటుంది. భూమి ఉన్న ప్రతి రైతు బాధలు పడాల్సిందేనా..? నష్టాలు భరించాల్సిందేనా? లేదంటే వ్యవసాయం చేయడం మానుకోవాలా? రైతు ఏడ్చిన దేశం ఎన్నడూ బాగుపడదని పెద్దలు చెబుతుంటారు.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం అరిష్టమంటారు.. అలాంటి రైతు ఘోషను ఎందుకు పట్టించుకోవడం లేదు.. రోజుకో చోట ఉరి పెట్టుకుంటున్న అన్నదాతకు జీవించే హక్కు లేదా... అప్పు చేస్తే , అది తీర్చకుంటే... చావే శరణ్యమా? మేధావులు ఎంతోమంది ఎన్నో అంశాలపై చర్చించే వారు రైతు బలవన్మరణాలపై చర్చించాలి.. అప్పు చేసిన రైతు ఆత్మహత్య చేసుకోకుండా ప్రత్యామ్నాయంగా భరోసా కల్పించే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి..
ప్రస్తుతం తెలంగాణలో వరి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.. చేసిన అప్పుకు వడ్డీకి వడ్డీ పెరుగుతుంది తప్పా... పండించిన పంటకు గిట్టుబాటు రావడం లేదని... వడ్డీ ఎలా తీర్చేదని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు ఇచ్చిన వాళ్లు అందెలమెక్కి కూర్చుంటున్నారు. విత్తనం అమ్మిన వారు , పురుగుమందులు, ఎరువులు అమ్మిన వారు ఆనందంగానే ఉన్నారు.. ఆఖరికి అప్పుచేసి వారందరికి ఉపయోగపడిన రైతు మాత్రం ఉరికంబమెక్కడం ఎంతవరకు సమంజసం.. ఇప్పటికైనా రైతు సమస్యలపై సుధీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం దేశంలోని ప్రతి ఒక్కరిపై ఉంది. రైతులు లేకుంటే దేశం లేదనేది గ్రహించాల్సిన బాధ్యత రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలతో పాటు అన్ని వ్యవస్థలు ఆలోచించాలి.. ఆదుకోవాలని కోరుతూ...
రఫీ, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి