ఆన్ లైన్ పర్సనల్ లోన్ పరేషాన్
ఈమెయిల్ లో ఈజీ లోన్ అప్లికేషన్
క్లిక్ చేస్తే చాలు సులువుగా అప్లై
ఆదాయం అక్కర్లేకుండానే లోన్
సులువైన నెలసరి వాయిదా పద్దతి
అన్నీ బాగున్నాయంటే అంతే గతి
నెల వాయిదా తీర్చకుంటే తప్పదు తలనొప్పి
మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా.. ఉండే ఉంటుంది.. అందులో జీమెయిల్ , వాట్సాప్ , ఇతరతర యాప్ లు ఉండే ఉంటాయి. ఇంకేముందీ ఏ యాప్ ఓపెన్ చేసిన పేరొందిన ప్రైవేటు బ్యాంక్ ల యాడ్స్ పరేషాన్ చేస్తుంటాయి. ఆర్ధిక ఇబ్బందులున్న చిన్నచిన్న కంపెనీల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు అవసరం కొద్ది వాటిని క్లిక్ చేస్తే క్షణాల్లో అకౌంట్ లో అడిగినంత అమౌంట్ వచ్చేస్తుంది. అక్కడ అవసరం తీరినా అసలు తంటాలు ఎప్పుడు మొదలవుతాయంటే.. నెలసరి వాయిదా చెల్లించేటప్పుడు.. ఆదాయ వనరులు చూడకుండానే లోన్ లు ఇస్తున్నాయి కొన్ని బ్యాంక్ లు.. అలా తీసుకున్న వారు నెలసరి వాయిదా చెల్లించకుంటే ఫోన్ లు చేసి, రికవరీ ఏజెంట్లను ఇంటికి పంపి వసూళ్లు చేస్తుంటాయి. లోన్ మంజూరు చేసి, అకౌంట్ లో డబ్బులు వేసేవరకు రానీ బ్యాంక్ సిబ్బంది ఒకటి రెండు వాయిదాల సమయం దాటిపోయేవరకు వేచి ఉండి ఆ తరువాత రికవరీ సిబ్బందిని పంపించి వసూళ్లు చేస్తుంటారు.. చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసే వారు నెల జీతం మీద ఆధారపడే వారు లోన్ తీసుకుంటే వారి జీతం నుంచి వాయిదా చెల్లించడం సులభతరమే.. కానీ కొన్ని కంపెనీల్లో జీతాలు సమయానికి ఇవ్వని యాజమాన్యాలు, అసలు ఉద్యోగం చేయని వారు మాత్రం ఇలాంటి యాప్ లద్వారా లోన్ లు తీసుకుంటే.. మాత్రం ఇబ్బందులు తప్పవు.
ఓ వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. అతడికి అత్యవసరంగా డబ్బు అవసరం పడింది. ఆన్ లైన్ లో లోన్ అప్లికేషన్ లో వివరాలు ఇచ్చేశాడు. అటు నుంచి ఫోన్ వచ్చింది. అతని వివరాలు మొత్తం చెప్పాడు.. నిమిషాల్లో అతని అకౌంట్లో డబ్బు పడింది. హమ్మయ్యా అని ఆ అత్యవసర సమయం దాటిపోయిందనుకున్నాడు. కొన్ని నెలలు అతని కంపెనీ బాగానే నడిచింది. నెలనెల వాయిదా క్రమం తప్పకుండా ఇచ్చేస్తున్నాడు. ఆ తరువాత కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కంపెనీ జీతాలు ఇవ్వడం మానేసింది. ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో తీసుకున్న లోన్ కు వాయిదాలు బకాయలు పడ్డాయి.. లోన్ ఇచ్చిన బ్యాంక్ వాళ్లు ఫోన్ లు చేస్తున్నారు. ఇతను మరో పనికి కుదరలేక పోతున్నాడు. ఇటువంటి సమయంలో ఏం చేయాలో తెలియక అతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. బ్యాంక్ వాళ్లు ఏదైతే అత్యవసర సమయంలో డబ్బు ఇచ్చి ఆదుకున్నారో.. అదే విధంగా లోన్ వసూల్లు చేసేవారి హింసకు ఆత్మహత్య చేసుకునేలా చేశారు..
ఇటీవల కాలంలో అనేక బ్యాంక్ లు కేవలం పాన్ , ఆధార్ కార్డులతో అత్యధికంగా లోన్ లు ఇవ్వడం మామూలు అయ్యింది. సిబిల్ అనేది చెక్ చేయడం , లోన్ మంజూరు చేయడం సులువుగా ఉంది. చాలా మంది ఆర్ధిక స్థితి, ఆదాయ మార్గాలతో సంబంధం లేకుండా లోన్లు ఇవ్వడం, అధిక వడ్డీలతో నెలసరి వాయిదాలు పొందడం బ్యాంక్ లు ఆఫర్ల పేరుతో ఆకట్టుకుంటున్నాయి. అవసరం లేకున్నా వాళ్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్శితులై లోన్ లు తీసుకుంటున్న వారు ఆ తరువాత వాయిదాలు చెల్లించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఆఖరికి ఉద్యోగాలు లేని వారు , ఉన్న ఉద్యోగంలో జీత భత్యాల భద్రత లేని వారు అనేక ఇబ్బందులలో ప్రాణాలు ఫణంగా పెడుతున్న సంఘటనలు కలవరపెడుతున్నాయి..
ఇటువంటి యాప్ లు, ఆన్ లైన్ లోన్ ల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అడ్డగోలుగా రుణాలు ఇచ్చేస్తూ అధిక వడ్డీ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు రంగం బ్యాంకులను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అమాయక జనాలకు ఆఫర్ల పేరుతో ఆకట్టుకోవడం, అప్పుల ఊబిలోకి దించడం మోసం చేయడమే అని గ్రహించి ఆన్ లైన్ అప్పుల పై చర్యలు చేపట్టాలి..