కాంగ్రెస్ టీఆర్ఎస్ కు తొత్తు
*విద్యామంత్రి ఇలాకా డిగ్రీ కాలేజీ కూడా లేదు
*కేసీఆర్ ఫాం హౌస్ కోసం కాళేశ్వరం నీళ్లు
*ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం
*సింహం సింగిల్ గానే వస్తుంది
*వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రసంగం
మంచోడు...మంచోడు అంటే మంచం కోల్లు ఎత్తుకెళ్లిన కేసీఆర్ అని పాదయాత్ర చేస్తుంటే ప్రతీ గ్రామంలోనూ ఎన్నో సమస్యలు వినిపిస్తున్నాయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం మహా పాదయాత్ర 5వ రోజు ఆదివారం ఘనంగా కొనసాగింది. ఉదయం 10.50 నిమిషాలకు మహేశ్వరం నియోజకవర్గంలోని నాగారం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా కొత్తతండా, డబీల్ గూడ, మన్సాన్ పల్లి, కొత్వాల్ తండా మహేశ్వరం నియోజకవర్గం వరకు సాగింది. మొత్తం 12.6 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి హామీనిస్తూ శ్రీమతి వైయస్ షర్మిల గారు ముందుకు సాగారు. సాయంత్రం మహేశ్వరం నియోజకవర్గంలో సభ నిర్వహించారు.
విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్దులు, వితంతువులు విలపిస్తుంటే కన్నీళ్లాగడం లేదు. ప్రతీ వర్గం గురించి వైయస్ఆర్ గారు అప్పట్లో ఆలోచన చేశారు. అలా కదా ఒక నాయకుడు ఆలోచించాల్సింది. అది కదా ఒక ముఖ్యమంత్రి పని తనమంటే...మరి ఇప్పుడు ఉన్నాడు ఒక నాయకుడు కేసీఆర్...పాములు ఎరగని పుట్టలు లేవు...కేసీఆర్ మోసం చేయని వర్గం లేదన్నారు. రైతులను, విద్యార్థులను, దళితులను, నిరుద్యోగులను మోసం చేశాడు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తానని మోసం చేశాడు. ఇలా ప్రతీ వర్గాన్ని మోసం చేసిన మోసగాడు కేసీఆర్. మంచోడు...మంచోడు అనుకుంటే మంచం కోల్లు ఎత్తుకు పోయాడట కేసీఆర్ లాంటి వాడన్నారు షర్మిల
.వైయస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశాడు. పేదవారిడి జబ్బొస్తే ఎలా..? అని ఏ నాయకుడు ఆలోచించలేదు. పేదల కోసం ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీని వైయస్ఆర్ అందించాడని గుర్తుచేశారు. తెలంగాణలో ఇప్పుడు చూస్తే అడుగడుగునా సమస్యలు ఉన్నాయన్నారు.
కేసీఆర్ ఫాం హౌస్ కోసం కాళేశ్వరం నీళ్లు....
తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, కానీ కేసీఆర్ తన ఫాం హౌస్ కోసం కాళేశ్వరం నీళ్లను వాడుతున్నాడని వైయస్ షర్మిల అన్నారు. నియామకాలు కూడా కేసీఆర్ కుటుంబానికే ఇచ్చుకున్నాడు. ఐదుగురు కుటుంబంలో ఉంటే అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తలకాయ నరికేటోడికే తల్వార్ ఇచ్చినట్టు ఒక కిరాతకున్ని ముఖ్యమంత్రిని చేసుకున్నామన్నారు. గొర్లు, బర్లు ఇచ్చి నిరుద్యోగులను కేసీఆర్ కాచుకోమంటున్నాడు. ఇదేనా బంగారు తెలంగాణా అంటే అని ప్రశ్నించారు.
సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారు....
మహేశ్వరం నియోజకవర్గానికి సబితా ఇంద్రారెడ్డి ఏం చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎంత మందికి కట్టించారు. కనీసం ఒక్క డిగ్రీ కళాశాలైనా కట్టించారా అంటూ ప్రశ్నించారు. వర్షం వస్తే నీళ్లు ఇంటిలోకి వచ్చి ప్రజలు బిక్కు...బిక్కు..మంటూ బతుకుతున్నారు. మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఈ ప్రాంతానికి విడుదల చేసిన రూ.90 కోట్లు ఎవరి చేబుల్లోకి పోయాయి. కేసీఆర్ ప్లీనరీ అని నగరంలో ఎక్కడ చూసినా ఆయన మొకారవిందమే కనిపిస్తోందన్నారు.ఐ.టీ.ఐ.ఆర్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటీగ్రేటెడ్ రీజన్ అని, 75 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆ హామీలన్నీ ఎక్కడ పోయాయని ప్రశ్నించారు.
పీనుగుల మీద పైసలు ఏరుకునే కేసీఆర్...
పీనుగుల మీద పైసలు ఏరుకునే కేసీఆర్ పాలనలో ఉన్నామని వైయస్ షర్మిల అన్నారు. ఆడవారి మాన ప్రాణాలకు గండం ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి లిక్కర్ ఒక్కటే ఆదాయమైపోయింది. బీర్లు, బార్ల తెలంగాణాగా మారిపోయింది. అయ్యా, కొడుకులు మాటలు చెప్పే మొనగాల్లే కానీ...పూటకు బత్యం ఇచ్చే పుణ్యాత్ములు కారన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్ల మీదికొచ్చి ధర్నాలు చేస్తే ఎందుకు చేస్తున్నారో అని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మహిళలు పోలీస్ స్టేషన్ లో బలై పోయినా, నడి రోడ్డు మీద లాయర్లను నరికి చంపినా పట్టించుకోలేదని ప్రశ్నించారు.
నిరుద్యోగుల కోసం ప్రతీ మంగళవారం దీక్ష...
పార్టీ పెట్టక ముందు నుంచే నిరుద్యోగుల కోసం మేము ప్రతీ మంగళవారం దీక్ష చేస్తున్నాము. మూడు రోజుల నిరాహారదీక్ష చేస్తామంటే కేసీఆర్ పోలీసులతో దాడి చేయించాడు. ప్రజల సమస్యలు తీర్చడం కోసం ఒక ఆడదాన్ని అయిఉండి పాదయాత్ర చేస్తున్నాను. అధికారంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ కు దమ్ముంటే మాతో పాటూ పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. సమస్యలు ఉంటే కేసీఆర్ రాజీనామా చేయాలని అన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పొత్తు...
మొన్న చిన్న దొర కేటీఆర్ బీజేపీతో మాకు పొత్తుందన్నారు. బీజేపీతో మీకు, మీ అయ్యకు పొత్తుందని అన్నారు. కేసీఆర్, బీజేపీకి సంబంధం ఉంది కనుకనే....కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు, రుజువులు ఉన్నా జైల్లో పెట్టించడం లేదు. నా వీపు నువ్వు గోకు నీ వీపు నేను గోకుతా అని కేసీఆర్, మోడీ ఒకరి కోసం ఒకరు పనిచేస్తున్నారు. బీజేపీ లాంటి మతతత్వ పార్టీలతో, ప్యాకేజీల కోసం అమ్ముడుపోవాలని చూస్తున్న కాంగ్రెస్ తో, టీఆర్ఎస్ తో పొత్తులేదన్నారు. సింహం సింగిల్ గానే వస్తుందని అన్నారు. వైయస్ఆర్ వారసత్వం, విశ్వతనీయత మాకుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై మోడీ, కేసీఆర్ ఒక్కరైనా పన్ను తగ్గించుకుంటే ఇంతలా ధరలు పెరిగేవి కాదని తెలిపారు. వైయస్ఆర్ గారు తన అక్కాచెల్లేల్ల మీద గ్యాస్ ధరలు పడొద్దని ప్రభుత్వమే ఆ రోజుల్లో రూ.50 ధర బరించిందన్నారు. ఇప్పుడున్న నాయకులు ఉంటే ఎంత....ఊడితే ఎంత అన్నారు.
కేసీఆర్ కు కాంగ్రెస్ తో పొత్తుంది...
కేసీఆర్ కు కాంగ్రెస్ తోనూ పొత్తుందని శ్రీమతి వైయస్ షర్మిల గారు అన్నారు. రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉందన్నారు. పట్టపగలే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పట్టు పడినా ఇప్పటికీ అరెస్టు చేయలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తో కేసీఆర్ కు పొత్తుందని, మాకు అలాంటి పొత్తులు అవసరం లేదని, సింహం సింగిల్ గానే వస్తుందన్నారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కేసీఆర్ నాశనం చేశాడు. ప్రపంచ బ్యాంక్ నుంచి కేసీఆర్ లక్షకోట్లు అప్పు తెచ్చాడు. బీడీ బిచ్చమూ...కల్లు ఉద్దరా...అన్నట్టు అన్ని అంత డబ్బు తెచ్చినా ఆరోగ్య శ్రీకి, ఫీజు రియాంబర్స్ మెంట్ కు, రుణమాఫీ చేయడం లేదు. కేసీఆర్ పోవాలి...వైయస్ఆర్ గారి సంక్షేమ పాలన మళ్లీ రావాలని అన్నారు. వైయస్ఆర్ సంక్షేమ పాలన అంటే ఉచిత వైద్యం, స్వంత ఇళ్లు, వ్యవసాయం పండుగ కావడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, అప్పులు లేని బతుకులు జీవించటం అని అన్నారు. ప్రజల కోసమే తెలంగాణ పార్టీ పుట్టిందని అన్నారు. ఒక్క అవకాశం తమకు ఇవ్వాలని కోరారు. మహేశ్వరం గ్రామంలో ఐదో రోజు పాదయాత్ర ముగిసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి